టెట్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు కూడా ఎదురుచూస్తున్నారు.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2027 సెప్టెంబర్ నాటికి వర్కింగ్ టీచర్లు తప్పనిసరిగా టెట్ సాధించాల్సి ఉంది. దీంతో చివరి వరకు వేచి చూడకుండా.. మొదటి అవకాశంగా నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే టెట్ పరీక్షలో అర్హత సాధించేందుకు ప్రిపేర్ అవుతున్నారు.
2010 కంటే ముందు డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన టీచర్లు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలనే నిబంధనన అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 25–30వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం పడనుంది. . అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి టెట్ నుంచి మినహాయింపు పొందాలని ఉద్యోగ సంఘాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కానీ మెజార్టీ టీచర్లు సుప్రీం తీర్పునకు అనుగుణంగా టెట్ అర్హత సాధించేందుకు పుస్తకాల కుస్తీ పడుతూ టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు కేవలం ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉండి ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు టెట్ క్వాలిఫై నిర్ణయం భారంగా మారింది. సర్వీసు ఉండి.. రిటైర్మెంట్కు దగ్గరవుతున్న తమకు సుప్రీం ఇచ్చిన తీర్పు సరికాదాని వారు ఆవేదన చెందుతున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుని సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరుతున్నారు.
ఏటా రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం గతేడాది నవంబర్ 4న టెట్నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి టీచర్లకు టెట్ నిర్వహించే క్రమంలో జీవోలో మార్పులు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే.. మరో నెల రోజులు పట్టే అవకాశం ఉన్నందున.. నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదలపై సందిగ్దత నెలకొంది. మరో వారంలో రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. సిద్ధమేనంటూ.. నిరుద్యోగులతో పాటు టీచర్లు టెట్‌కు సన్నద్ధమువుతున్నారు..