News Media career
ఉదయం లేవగానే.. న్యూస్ పేపర్ చదివినా.. టీవీ వార్తలు చూసినా… వెబ్సైట్, వాట్సాప్ ఇలా అనేక మాధ్యమాల్లో వింతలు, విశేషాలు చదవి ఆనందించినా..ఇవన్నీ మీడియా రంగంలో పగలూ, రాత్రి పనిచేసే జర్నలిస్టు మిత్రుల శ్రమనే.. అయితే మీడియా (న్యూస్ సెగ్మెంట్) లో ఉండే జాబ్‌లు, అందులో చేరాలంటే చదవాల్సిన కోర్సులు, ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు, కెరీర్ అవకాశాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఒకప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో తెలుపుతూ వార్తలు మాత్రమే అందించే మీడియాలో తర్వాత ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫీచర్స్, ఎడ్యుకేషన్, బిజినెస్ వంటి సెగ్మెంట్లు పుట్టుకొచ్చి జర్నలిజాన్ని విస్తరించాయి. ఫలితంగా పదుల సంఖ్యలో జాబ్ ప్రొఫైల్స్ క్రియేట్ అయి వేల మందికి ఉపాధి కల్పించాయి. రేడియో, పేపర్ మాత్రమే వార్తలకు ప్రసార సాధనాలుగా ఉండే రోజుల నుంచి టెలివిజన్, వెబ్‌సైట్స్, యాప్స్ వంటి టెక్నాలజీ రావడమే ఇందుకు కారణం. ఇందులో కొన్ని పోస్టులుకు సాధారణ, ప్రొఫెషనల్ డిగ్రీలు అవసరం కాగా మరి కొన్నింటికి సర్టిఫికెట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు చేస్తే సరిపోతుంది.
ప్రింట్, టీవీ, రేడియోల్లో జాబ్ ప్రొఫైల్స్
రిపోర్టర్/కరస్పాండెంట్: వివిధ సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి పాఠకులను దృష్టిలో పెట్టుకొని న్యూస్ స్టోరీ రాయడం రిపోర్టర్ ప్రధాన విధి. పరిశోధన నిర్వహించడం, అధికారిక సమాచార విశ్లేషణ, ఇతర ప్రెస్ నోట్ల ద్వారా రిపోర్టర్ ఈ విధులు నిర్వర్తిస్తాడు. జర్నలిజంలో యూజీ/పీజీ/డిప్లొమా చదివిన వారు అర్హులు. భాషపై పట్టు, రచనాసక్తి, అంశాలను విశ్లేషించే సామర్థ్యం ఉంటే సాధారణ డిగ్రీ చేసినవారూ రిపోర్టర్ కావచ్చు. ఇందుకు ఆయా మీడియా సంస్థలు పరీక్షలు నిర్వహించి శిక్షణ ఇస్తాయి.
సబ్ ఎడిటర్: రిపోర్టర్ పంపిన న్యూస్‌తో పాటు వెబ్సైట్లు, బ్లాగ్లు, ఇతర ప్రెస్నోట్లు చూసి వార్తలను ప్రచురణకు అణుగుణంగా తీర్చిదిద్దదడం, అనువదించడం, ప్రూఫ్ రీడ్ చేయడం సబ్ఎడిటర్ విధి. ఇందుకు కూడా సాధారణ డిగ్రీతో పాటు జర్నలిజం కోర్సులు చేసిన వారు అర్హులు. ఆయా భాషల్లో ఎంఏ, లిటరేచర్ చదివిన వారూ ట్రై చేయవచ్చు.
కాపీ ఎడిటర్: పేపర్లో సబ్ఎడిటర్ చేసే పనిని టెలివిజన్‌లో కాపీ ఎడిటర్/కాపీ రైటర్ చేస్తారు. రెండింటి అర్హతలు ఒకటే. పేపర్లో కేవలం టెక్స్ట్, ఫోటోస్, గ్రాఫిక్స్ మాత్రమే ఉపయోగిస్తారు. కానీ టీవీలో అదనంగా విజువల్స్, ఆడియో, యానిమేషన్ వంటివి ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కాపీ ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది.
కంటెంట్ రైటర్: న్యూస్ పేపర్, టీవీల్లో సబ్ఎడిటర్లు, కాపీ ఎడిటర్లు నిర్వర్తించే విధులను వెబ్సైట్, బ్లాగ్, యాప్‌లలో కంటెంట్ రైటర్లు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా కోర్సులు చేయకున్నా భాషపై పట్టు ఉంటే ఎవరైనా కంటెంట్ రైటర్లగా స్థిరపడవచ్చు. పైన చెప్పిన అన్ని జాబ్లకు ప్రధాన సోర్స్ రిపోర్టర్, అధికారిక వెబ్‌సైట్స్, కార్పొరేట్ పీఆర్వోలు.
వెబ్/డిజిటల్ ఎడిటర్: వెబ్సైట్లో పబ్లిష్ అవుతున్న కంటెంట్‌ను ఆన్లైన్ రీడర్లకు తగినట్లు ఎడిట్ చేయడం వెబ్ ఎడిటర్ విధి. వీరిని కంటెంట్ మేనేజర్ లేదా కంటెంట్ ఎడిటర్ అని కూడా అంటారు. ఇందుకు ఏంఏ, లిటరేచర్ తో పాటు జర్నలిజం చదివుండాలి.
న్యూస్ ప్రజెంటర్/రీడర్: కాపీ ఎడిటర్లు రాసిన న్యూస్‌ను వీక్షకులు, శ్రోతలకు అర్థమయ్యేలా స్పష్టంగా చదివి వినిపించడం న్యూస్ రీడర్/యాంకర్ విధి. ఆకట్టుకునే ఆహార్యం, సరళ భాషలో స్పష్టంగా మాట్లాడటం, చక్కని స్వరం, భాషపై మంచి పట్టు, గలగల మాట్లాడే నైపుణ్యం, కరెంట్ అఫైర్స్‌పై అవగాహన ఉంటే క్వాలిఫికేషన్‌తో అవసరం లేకుండా ఎవరైనా న్యూస్ యాంకర్ కావచ్చు.
వాయిస్ ఓవర్: ఫోటో, వీడియో కథనంతో పాటు ఆకట్టుకునే స్వరంతో నవరసాలను పండిస్తూ ఆ కథనం తాలూకు వివరాలు వెల్లడించే పని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌ది. చక్కనైన స్వరం ఉండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా వాయిస్ ఓవర్లో షార్ట్‌టెర్మ్/లాంగ్‌టెర్మ్ కోర్సులు చదివితే సరిపోతుంది.
ఇంటర్ప్రిటర్/ట్రాన్స్‌లేటర్: సాధారణంగా సబ్ఎడిటర్లు, కాపీ ఎడిటర్లు ట్రాన్స్లేషన్ చేస్తారు. కొన్నిసార్లు ప్రత్యేకంగా అనువాదకులు ఉండి న్యూస్‌ను ఇంటర్‌ప్రిట్ చేస్తారు. జర్నలిజంతో పాటు ఆయా భాషల్లో ఎంఏ, లిటరేచర్ చదివి కనీసం రెండు భాషల్లో గ్రామర్, రచనా శైలి తెలిస్తే ట్రాన్స్లేటర్లుగా రాణించవచ్చు.
కార్టూనిస్ట్: ఇందుకు ప్రత్యేకంగా కోర్సులు అవసరం లేదు కానీ వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా కార్టూన్లు, క్యారికేచర్లు గీయగలిగే నేర్పు ఉండాలి. సాధారణంగా డిప్లొమా ఇన్ పెయింటింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (పెయింటింగ్) చేసిన వారికి అవకాశాలు లభిస్తాయి. వార్తను విశ్లేషించి హాస్యంగా గీయగలిగితే ఎవరైనా కార్టూనిస్ట్‌లు కావచ్చు.
ఫోటో ఎడిటర్: వార్తా పత్రిక, టీవీ, వెబ్‌సైట్స్/యాప్‌లలోని వార్తలకు ఆకట్టుకునే, స్పష్టమైన ఫోటోలు, మాయ చేసే చిత్రాలు అందివ్వడం ఫోటో ఎడిటర్ ముఖ్య విధి. కలర్ కరెక్షన్, రెజల్యూషన్ సెట్టింగ్, సైజ్ వంటివి తగిన విధంగా చేయాలి. ఇందుకు క్వాలిఫికేషన్ తో పనిలేదు. ఏదైనా డిగ్రీ చదివి కాస్త క్రియేటివిటీతో ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఆపరేట్ చేయగలిగితే చాలు.
వీడియో ఎడిటర్: గ్రాఫిక్స్, యానిమేషన్, మంచి విజువల్ ఎఫెక్ట్స్‌తో వీడియోలను ఎడిటింగ్ చేసే వ్యక్తి వీడియో ఎడిటర్. ఇందుకు ఏదైనా డిగ్రీతో పాటు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు నేర్చుకుంటే సరి.
ఫోటోగ్రాఫర్/ఫోటో జర్నలిస్ట్: న్యూస్ స్పాట్స్, ఈవెంట్స్, ప్రెస్మీట్లకు హాజరై ఫోటోలు తీయడం ఫోటోగ్రాఫర్ విధి. వీటికి అదనంగా వెరైటీ ఫోటోలు ఏ సందర్భంలో కనిపించినా తీయాల్సి ఉంటుంది.
వీడియోగ్రాఫర్/వీడియో జర్నలిస్ట్: జరుగుతున్న వాస్తవాన్ని కళ్లకు కట్టినట్టు చూపే బాధ్యత వీడియో జర్నలిస్ట్‌ది అయితే టెలివిజన్, వెబ్‌సైట్‌కు అనువైన వీడియోలు తీయడం, స్టూడియోలో బులెటిన్స్ రికార్డ్ చేయడం కెమెరామెన్/వీడియోగ్రాఫర్ పని. ఏదైనా డిగ్రీ, డిప్లొమా చేసిన వారు ఫోటో, వీడియోగ్రాఫర్లుగా రాణించవచ్చు.
ఆర్టిస్టు/డిజైనర్: న్యూస్ పేపర్ ను ఒక లే అవుట్లో డిజైన్ చేసే వ్యక్తి ఆర్టిస్ట్. సబ్ఎడిటర్లు పంపిన న్యూస్ స్టోరీస్, ఫోటోలను ప్రింటింగ్‌కు అనుగుణంగా పేజీలో సెట్ చేస్తాడు.
వెబ్ డిజైనర్: వెబ్‌సైట్‌ను ఆకట్టుకునేలా, సులువుగా నావిగేట్, బ్రౌజ్ చేసేలా కోడింగ్ రాసి వెబ్ పేజీలు, మొబైల్ యాప్‌లను డిజైన్ చేయడం వెబ్ డిజైనర్ విధి. ఇందుకు గాను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్ర్కిప్ట్ వంటి కోడింగ్ లాంగ్వేజ్‌లు తెలిసుండాలి. కంటెంట్ అప్లోడ్ చేసి, పబ్లిష్ చేయడం, సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా చేయాలి.
ప్రొడక్షన్ అసిస్టెంట్: టెలివిజన్, రేడియో బులెటిన్/ప్రోగ్రామ్ ప్రొడక్షన్లో సహకారం అందించే వారు ప్రొడక్షన్ అసిస్టెంట్లు. ఇందుకు ఎలక్ర్టానిక్స్‌లో డిప్లొమా, ఇంజినీరింగ్ చదివిన వారు అర్హులు.
యానిమేటర్: టీవీల్లో ఆకట్టుకునేలా యానిమేషన్ వీడియోలను సృష్టించడం వీరి పని. ఏదైనా మల్టిమీడియా సాఫ్ట్వేర్లు తెలిసుండాలి. ఇందుకు 10, ఇంటర్ తర్వాత స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు కూడా చేయవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
గ్రాఫిక్ డిజైనర్: ఆకట్టుకునే డిజైన్లతో పాఠకులు, వీక్షకులను కట్టి పడేసే గ్రాఫిక్స్ అందివ్వడం గ్రాఫిక్స్ డిజైనర్ పని. ఇందుకు కోరల్ డ్రా, ఇన్డిజైన్, ఇల్లూస్ర్టేటర్, ఫోటోషాప్ వంటి అప్లికేషన్లను బాగా నేర్చుకోవాలి.
ప్రింటింగ్ అసిస్టెంట్: ప్రెస్‌లో వార్తా పత్రికను ముద్రించడంలో ప్రింటిగ్ అసిస్టెంట్ కీలక పాత్ర పోషిస్తారు. ప్లేట్స్ తయారు చేసుకొని వాటిని మిషన్లో అమర్చడం, ప్రింటింగ్ తర్వాత ఫోల్డింగ్, సెపరేషన్ చేయడం వంటివి ఇతని విధులు.
సౌండ్ ఇంజినీర్: టెలివిజన్, రేడియోల్లో బులెటిన్లకు అనుగుణంగా సౌండ్ రికార్డింగ్, కాపీయింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, రీప్రొడక్షన్ చేయడం వంటివి సౌండ్ ఇంజినీర్ విధులు.
కాస్ట్యూమ్ డిజైనర్: టెలివిజన్లో న్యూస్ ప్రజెంటర్స్, యాంకర్స్, ఇతర ఆర్టిస్టులకు సందర్భానికి తగిన విధంగా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయడం ఇతని పని. ఇందుకు ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ చదివుండాలి. లేదా కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో సర్టిఫికెట్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు పాసవ్వాలి.
మేకప్ ఆర్టిస్ట్: న్యూస్ ప్రజెంటర్స్, యాంకర్స్, ఇతర ఆర్టిస్టులు ఆకర్షణీయంగా కనబడాలంటే మేకప్ ఆర్టిస్టుల పనితనం ఎంతో అవసరం. దీనికి బ్యూటీషియన్ కోర్సులు చేస్తే సరిపోతుంది.
కంపోజర్: రెండు, మూడు భాషల్లో టైప్ రైటింగ్ తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్ వంటి నైపుణ్యాలు అవసరం.
కోర్సులు
రేడియో, వార్తా పత్రికలు, మేగజీన్, టెలివిజన్, వెబ్సైట్, మొబైల్ యాప్స్ కు సంబంధించి న్యూస్ సెగ్మెంట్లో పని చేయాలంటే ఒకప్పుడు సంబంధిత స్కిల్స్ ఉంటే సాధారణ డిగ్రీలు సరిపోయేవి. కానీ ఇటీవల కాలంలో మీడియా కంపెనీలు ప్రొఫషనల్ కోర్సులు చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే ఆయా కోర్సుల్లో జాబ్ స్కిల్స్ గురించి నేర్పించడమే. ఈ కోర్సులు రెగ్యులర్/డిస్టెన్స్ విధానంలో అందుబాటులో ఉన్నాయి. పాలిటిక్స్, బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, ఫీచర్స్ అండ్ లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, సినిమా, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, అగ్రికల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్వెస్టిగేటివ్, డెవలప్‌మెంట్ తదితర సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన ఉన్నవారికి ఉపాధి అవకాశాలు మెండు.
కోర్సు కాలవ్యవధి అర్హత
డిగ్రీ/పీజీ/డిప్లొమా
బీఏ లాంగ్వేజస్ 3 ఇంటర్ ఎనీ గ్రూప్
ఏంఏ లాంగ్వేజస్ 2 డిగ్రీ ఎనీ గ్రూప్
ఏంఏ లిటరేచర్ 2 ఏదైనా డిగ్రీ
బీసీజే 3 ఇంటర్ ఎనీ గ్రూప్
ఎంసీజే 2 డిగ్రీ ఎనీ గ్రూప్
బీఎఫ్ఏ (ఫోటోగ్రఫీ) 4 ఇంటర్ ఎనీ గ్రూప్
బీఎఫ్ఏ (పెయింటింగ్) 4 ఇంటర్ ఎనీ గ్రూప్
బీఎస్సీ-డిజిటల్ పబ్లిషింగ్ 3 ఇంటర్/10+2
బీటెక్/బీఈ 4 ఇంటర్ ఎంపీసీ
డిప్లొమా ఇన్ ఈఈఈ 3 పదోతరగతి
డిప్లొమా ఇన్ ఈసీఈ 3 పదోతరగతి
డిప్లొమా ఇన్ ఈవీఈ 3 పదోతరగతి
డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ 3 పదోతరగతి
వీటితో పాటు ఫోటోగ్రఫీ, వెబ్ డిజైనింగ్, ఎడిటింగ్, సౌండ్ ఇంజినీరింగ్, యాంకరింగ్/న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, బ్యూటీషియన్, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్, డిజైనింగ్ అండ్ డీటీపీలో మూడు నెలల నుండి ఏడాది పాటు సాగే సర్టిఫికెట్, షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన వారు ఎవరైనా ఈ కోర్సులు చదవొచ్చు.
సంస్థలు
ఉస్మానియా యూనివర్శిటీ www.osmania.ac.in
ఇఫ్లూ-హైదరాబాద్ www.efluniversity.ac.in
ఎ.పి. కాలేజీ ఆఫ్ జర్నలిజం www.apcj.in
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ www.teluguuniversity.ac.in
బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ www.braou.ac.in
ఐఐఎంసీ-న్యూఢిల్లీ www.iimc.nic.in
ఐఐజేఎన్ఎం www.iijnm.org
అన్నామలై యూనివర్సిటీ www.dpub.info
ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం www.asianmedia.org
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లు www.polycetts.nic.in
ఎఫ్టీఐఐ ఇండియా, పుణే www.ftiindia.com
ఇండియన్ వాయిస్ ట్రైనింగ్ సెంటర్ www.indianvoiceovers.com
జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్-ముంబై www.zimainstitute.com
రామానాయుడు ఫిల్మ్ స్కూల్-హైదరాబాద్ www.ramanaidufilmschool.net
News Media career మీరు జర్నలిస్ట్ కావాలనుకుంటున్నారా?