Trending Posts

Content Developer career: కంటెంట్‍ డెవలపర్‍.. కతర్నాక్​ కెరీర్​

Content Developer career

ఒకప్పుడు రేడియో, వార్తా పత్రికలు, టీవీలకే పరిమితమైన వార్త ప్రపంచం నేడు వెబ్​సైట్​లు, యాప్​లు, సోషల్​ మీడియాకు విస్తరించింది. ఇప్పుడదే ట్రెండ్​ నడుస్తోంది. క్షణాల్లో న్యూస్​ అప్​డేట్స్​ తెలిపోతున్నాయి. దీని వెనక కంటెంట్​ డెవలపర్​లకు కంపిటీషన్​ పెరిగిపోయింది. సిటిజన్ జర్నలిజం విస్తరిస్తున్న వేళ చదువుతో సంబంధం లేకుండా ప్రతి గ్రాడ్యుయేట్ ఒక జర్నలిస్ట్ గా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కంటెంట్‍ డెవలపర్‍ కెరీర్‍ పై నేటి స్టోరీ..

కంటెంట్ డెవలపర్స్/వెబ్‍ డెవలపర్స్/ కంటెంట్‍ రైటర్స్/వెబ్‍ రైటర్స్/కంటెంట్‍ ప్రొవైడర్స్ / కంటెంట్‍ క్రియేటర్స్ / కంటెంట్‍ మేనేజర్స్/ మల్టీమీడియా డెవలపర్స్.. ఇలా ఏ పేర్లతో పిలిచినా.. మల్టిమీడియా కంటెంట్‍ (టెక్స్ట్/ఆడియో/వీడియో/స్ర్కిప్ట్ ఇమేజస్‍) సృష్టించడం, ఎడిటింగ్‍, పబ్లిషింగ్‍ చేయడం వీరు చేయాల్సిన పని. న్యూస్, ఇతర కంపెనీల వెబ్‌సైట్స్, బ్లాగ్స్, యూట్యూబ్ చానల్స్, మొబైల్‍ యాప్స్, సోషల్ మీడియా (వెబ్‍సైట్స్ & యాప్స్) వంటి డిజిటల్‍ ప్లాట్‍ఫాంలలో సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా, ఆకట్టుకునేలా వేగవంతంగా రాయాలి. వెబ్‍సైట్లు, న్యూస్‍ లెటర్స్, ప్రెస్‍ రిలీజెస్‍, బ్లాగ్స్, ఆర్టికల్స్, అడ్వర్‍టైజింగ్‍ అండ్‍ మార్కెటింగ్‍ వంటి వాటి కోసం కంటెంట్‍ తయారు చేయాలి.

అర్హతలు

జర్నలిజం, మాస్‍ కమ్యూనికేషన్‍లో డిగ్రీ, డిప్లొమా, పీజీ, ఎంఏ (ఇంగ్లిష్‍, తెలుగు, హిందీ, ఇతర భాషలు), ఎంఏ లిటరేచర్‍ చదివిన వారికి కంటెంట్‍ డెవలపర్స్‌గా మొదటి ప్రాధాన్యం లభిస్తుంది. కంప్యూటర్‍ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‍ టెక్నాలజీలో డిగ్రీ లేదా కంప్యూటర్‍ అప్లికేషన్స్/కోర్సుల్లో సర్టిఫికెట్‍/డిప్లొమా చేసిన వారికి తర్వాత స్థానం కల్పిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో వెబ్‍సైట్లు, మొబైల్‍ యాప్‍లు పెరిగిపోవడంతో ఏ డిగ్రీ చేసిన వారికైనా పలు మీడియా, వెబ్‍ కంపెనీలు కంటెంట్‍ డెవలపర్స్‌గా అవకాశం కల్పిస్తున్నాయి. సైన్స్ అండ్‍ టెక్నాలజీ, మెడిసిన్‍, బిజినెస్‍, ఎకానమీ, టెక్నాలజీ వంటి స్పెషలైజ్డ్ ఏరియాల్లో కంటెంట్‍కు ఆయా సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‍డీ చేసిన వారిని అహ్వానిస్తున్నాయి.

బేసిక్‍ స్కిల్స్
కంటెంట్ రైటింగ్‍
కమ్యూనికేషన్ స్కిల్స్
లాంగ్వేజ్ స్కిల్స్
కంప్యూటర్‌ పరిజ్ఞానం
హెచ్‌టీఎంఎల్, సీఎస్‍ఎస్‍
వెబ్ పబ్లిషింగ్
గ్రాఫిక్ డిజైనింగ్
ఫోటో/వీడియో ఎడిటింగ్‍
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‍
ఎస్‌ఈఓ స్కిల్స్
వెబ్‍ బేస్డ్ టెక్నాలజీ

రిలేటెడ్‍ కెరీర్లు
కంటెంట్ డెవలపర్స్
కంటెంట్ రైటర్స్
బ్లాగర్స్
వెబ్ డెవలపర్స్
మీడియా మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్
కంటెంట్ అప్‌లోడర్స్
అడ్వర్టయిజింగ్ కోఆర్డినేటర్
ఎస్‌ఈవో స్పెషలిస్ట్‌
సోషల్ మీడియా మేనేజర్‍
డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్‌
సోషల్ మీడియా మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్
గ్రాఫిక్‍ డిజైనర్లు
డిజిటల్ మీడియా అడ్వర్‌టైజర్స్

కోర్సులు

ఒకప్పుడు జర్నలిజం అండ్‍ అడ్వర్‍టైజింగ్‍ కోర్సు చేసిన వారికి మాత్రమే మీడియా అండ్‍ టెలివిజన్లో అవకాశాలుండేవి. ఇటీవల కాలంలో న్యూ మీడియా విస్తరించడంతో జర్నలిజం, మాస్‍ కమ్యూనికేషన్‍, ఎంఏ ఇంగ్లిష్‍, ఎంఏ లిటరేచర్‍తో పాటు ఇంతర డిగ్రీలు చేసిన వారు కంటెంట్‍ రైటర్లుగా కెరీర్‍ ప్రారంభిస్తున్నారు. ఈ రంగంలో ఉన్న డిమాండ్‍ను దృష్టిలో పెట్టుకొని పలు ఇన్‍స్టిట్యూట్‍లు క్రియేటివ్‍ రైటింగ్‍, కంటెంట్‍ రైటింగ్‍ లో సర్టిఫికెట్‍, డిప్లొమా కోర్సులను ఆఫర్‍ చేస్తున్నాయి. కాబట్టి లాంగ్వేజ్‍, లిటరేచర్‍, జర్నలిజంలో పీజీతో పాటు క్రియేటివ్‍ రైటింగ్‍లో షార్ట్‌టెర్మ్ కోర్సులు చేస్తే మరింత అడ్వాంటేజ్ ఉంటుంది.

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్‍ ఓపెన్‍ యూనివర్శిటీ (ఇగ్నో) ఇంటర్‍/10+2తో క్రియేటివ్‍ రైటింగ్‍ ఇన్‍ ఇంగ్లిష్‍ అనే డిప్లొమా కోర్సును అందిస్తోంది. కాలవ్యవధి ఏడాది. ఇందులో ఫీచర్‍ ఆర్టికల్స్, షార్ట్‌స్టోరీస్‍, పోయెట్రీ, టీవీ, రేడియ, వెబ్‍సైట్‍లలో స్ర్కిప్ట్స్ ఎలా రాయాలో నేర్పిస్తారు.
ది బ్రిటిష్‍ కౌన్సిల్‍ క్రియేటివ్‍ రైటింగ్‍లో రెండు నెలల సర్టిఫికెట్‍ కోర్సును ఆఫర్‍ చేస్తుంది. 16 ఏళ్లు నిండాలి. ఇందులో ఫీచర్‍ ఆర్టికల్స్, పోయెట్రీ, షార్ట్ స్టోరీలు రాయడంలో శిక్షణ ఇస్తారు.
సింబయాసిస్‍ సెంటర్‍ ఫర్‍ డిస్టెన్స్ లెర్నింగ్‍ ఏడాది వ్యవధి గల క్రియేటివ్‍ రైటింగ్‍ ఇన్‍ ఇంగ్లిష్‍ అనే డిప్లొమా కోర్సును అందిస్తోంది. దీనికి 50 శాతం మార్కులతో ఇంటర్‍ ఉత్తీర్ణత ఉండాలి.
జేవియర్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ కమ్యూనికేషన్‍ క్రియేటివ్‍ రైటింగ్‍లో‍ రెండు నెలల సర్టిఫికెట్‍ కోర్సును ఆఫర్‍ చేస్తుంది.

న్యూఢిల్లీలోని శ్రీ అరబిందో సెంటర్‍ ఫర్‍ ఆర్ట్స్ అండ్‍ కమ్యూనికేషన్ క్రియేటివ్‍ రైటింగ్‌లో స్వల్పకాలిక కోర్సులను ఆఫర్‍ చేస్తుంది. ఇందులో ఫీచర్‍ రైటింగ్‍, మీడియా రైటింగ్‍, ఎడిటింగ్‍, స్ర్కిప్టింగ్‍ వంటి అంశాలను నేర్పిస్తారు.

సెంట్రల్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ ఇండియన్‍ లాంగ్వేజస్‍ క్రియేటివ్‍ రైటింగ్‍ ఇన్‍ ఇంగ్లిష్‍ అనే డిప్లొమా కోర్సు ను అందిస్తుంది.

న్యూఢిల్లీలోని జవహర్‍లాల్‍ నెహ్రు యూనివర్శిటీతో పాటు ఇతర కేంద్ర విశ్వవిద్యాలయాలు ఎంఏ ఇంగ్లిష్‍ లో క్రియేటివ్‍ రైటింగ్‍ను ఆప్షనల్‍ పేపగా చేర్చి బోధిస్తున్నాయి.
హైదరాబాద్‍లోని Ace Web Academy, RVJ Media Group, Live Wire Institute వంటి పలు ప్రైవేటు ఇన్‍స్టిట్యూట్‍లు కంటెంట్‍ రైటింగ్‍లో స్పల్పకాలిక శిక్షణను అందిస్తున్నాయి.

కాసులు తెచ్చే క్యాంపెయినింగ్​

ఇటీవల కాలంలో కార్పొరేట్‍ కంపెనీలు, పొలిటికల్‍ పార్టీలు ఆన్‍లైన్‍, సోషల్‍ మీడియా క్యాంపెయినింగ్‍పై అధికంగా ఆధారపడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక్కో రాజకీయ నాయకుడు 3 నుంచి 6 మంది దాకా కంటెంట్‍ రైటర్లు, ఫోటో/వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్‍ డిజైనర్లు, సోషల్‍ మీడియా స్పెషలిస్టులను నియమించుకొని ఆన్‍లైన్‍ క్యాంపెయిన్‍ ద్వారా ఓటర్లకు దగ్గరవుతున్నారు. అలాగే బిజినెస్‍ క్యాంపెయిన్‍లో వస్తుసేవల సమాచారాన్ని వివరిస్తూ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

ఫేస్‌బుక్, వాట్సాప్‍, ట్విటర్, యూట్యూబ్‍ లింక్డ్ ఇన్, ఇన్‌స్టాగ్రామ్, పింటెరెస్ట్ వంటి సోషల్‍ మీడియా ప్లాట్‍ఫాంల ద్వారా ఒక వ్యక్తి, వస్తువు లేదా బ్రాండ్‍ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రచారం కల్పించడాన్ని సోషల్‍ మీడియా క్యాంపెయిన్‍ అంటారు. యూజర్స్ నుంచి స్పందన, ఫీడ్‍బ్యాక్‍ పొందడం, ఈమెయిల్‍ మార్కెటింగ్‍ లిస్ట్ తయారు చేయడం, వెబ్‍సైట్ ట్రాఫిక్‍ పెంచడం వంటి వాటి ద్వారా బ్రాండ్‍ ఇమేజ్‍ /అవేర్‍నెస్‍ పెంచడం దీని ప్రధాన ఉద్దేశాలు. ఇందులోనూ కంటెంటే కీలకపాత్ర పోషిస్తుంది.

ఫ్రీలాన్స్‌కే ప్రాధాన్యం

కాపీ రైటింగ్‍, గ్రాఫిక్‍ డిజైన్‍ వంటివి క్రియేటివ్‍ వర్క్స్ కావడంతో ఫ్రీలాన్స్‌ కంటెంట్‍ డెవలపర్స్ సంఖ్యా రోజురోజుకు పెరుగుతుంది. వీరు వెబ్‍సైట్లు, బ్లాగులు, యాప్‍లకు కంటెంట్ అందిస్తారు. సొంతంగా వెబ్‍సైట్ తయారు చేసి ప్రకటనల ద్వారా ఆదాయం పొందవచ్చు. ఇదే కాకుండా యూట్యూబ్‍ వంటి వీడియో ప్లాట్‍ఫాంల ద్వారా వీడియోలు తయారు చేసి యూజర్స్ ను చేరవచ్చు. కంటెంట్ క్రియేటర్లకు ప్రారంభంలో నెలకు సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉంది. పలు జాతీయ న్యూస్‍ వెబ్‍సైట్లు ఇంగ్లిష్‍ తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ప్రవేశించడంతో కంటెంట్‍ రైటర్లకు డిమాండ్‍ పెరిగింది.

నియామక సంస్థలు

న్యూస్‍ వెబ్‍సైట్లు: తెలుగులో ప్రధానంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, న్యూస్‍18, సమయం, బీబీసీ వంటి మెయిన్‍స్ర్టీమ్‍ న్యూస్‍ వెబ్‍సైట్లతో పాటు తెలుగు.వన్‍ఇండియా, ఏపీ7ఏఎమ్‍, తెలుగుగ్లోబల్‍, తుపాకీ, గ్రేట్‍ ఆంధ్రా, 123తెలుగు వంటి ఆన్‍లైన్‍ న్యూస్‍ వెబ్‍సైట్లు కంటెంట్‍ రైటర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి.
అడ్వర్‍టైజింగ్‍ ఏజెన్సీలు: ఇటీవల కాలంలో అడ్వర్‍టైజింగ్‍కు డిమాండ్‍ పెరగడగంతో కంటెంట్‍ రైటర్స్ కు ప్రాధాన్యత పెరిగింది. వీరు బ్రాండ్‍ ఇమేజ్‍ను ఇనుమడింపచేస్తూ, వినియోగదారులను ఆక్టటుకునేలా క్రియేటివిటీతో కంటెంట్‍ తయారు చేయాల్సి ఉంటుంది.
కార్పొరేట్‍ సంస్థలు: పలు కార్పొరేట్‍, మల్టినేషనల్‍ కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు వేగంగా, ఆకర్షణీయంగా అందించేందుకు కంటెట్‍ డెవలపర్స్, సోషల్‍ మీడియా మేనేజర్లు, ఎస్‍ఈవో స్పెషలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి.
పొలిటికల్‍ పార్టీలు: రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తాత్కాలిక లేదా ఫ్రీలాన్స్ కంటెంట్‍ రైటర్లు, సోషల్‍ మీడియా క్యాంపెయినర్లు, ఎస్‍ఈవో స్పెషలిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఓటర్లకు చేరువ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈవెంట్‍ ఆర్గనైజేషన్స్: నగరాల్లోని పలు ఈవెంట్‍ ఆర్గనైజేషన్లు క్రియేటివ్‍ కంటెంట్‍ రైటర్లను నియమించుకుంటున్నాయి. ఈవెంట్‍కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంక్షిప్తంగా, అతిథులను, వినియోగదారులను ఆకట్టుకునేలా రాయడం వీరి పని.

Content Developer career: కంటెంట్‍ డెవలపర్‍.. కతర్నాక్​ కెరీర్​

Leave a Comment