Film studies career
నటన దగ్గర నుంచి ఔట్‌డోర్ లైటింగ్ వరకు.. స్ర్కిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి పబ్లిసిటీ డిజైనర్ వరకు ప్రత్యేకమైన కోర్సులు ఎన్నో.. ఉపాధి అవకాశాలు మరెన్నో.. ఫిల్మ్ స్టడీస్ కోర్సులను ఆఫర్ చేస్తున్న యూనివర్శిటీలు, ఇన్స్టిట్యూట్లు, ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలు, ఓవరాల్ కెరీర్ ఆపర్చునిటీస్ మీకోసం..
సినిమా రంగంలో సర్టిఫికెట్, డిప్లొమా, యూజీ, పీజీ ప్రోగ్రాములు సార్ట్టెర్మ్, లాంగ్‌టెర్మ్ విధానంలో లభిస్తాయి. ఇందులో రాణిస్తే సెలెబ్రిటీ హోదాతో పాటు, విలాసవంతమైన జీవితం సొంతం అవుతుంది. భారీ స్థాయిలో వేతనాలు లభిస్తాయి. పబ్లిక్ ఫాలోయింగ్ పెరుగుతుంది. దీంతో పాటే ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని ఒత్తిడి, అధిక పనిగంటలుంటాయి. కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం, ఇతర ప్రదేశాలకు ట్రావెల్ చేయాల్సి రావడం, పబ్లిక్‌లో స్వేచ్చగా తిరగలేకపోవడం వంటి ఇబ్బందులంటాయి.
కెరీర్ అవకాశాలు
ఎంటర్టైన్మెంట్లో సమూల మార్పులు చోటుచేసుకోవడంతో కొత్తవారికి అవకాశాలు విరివిగా లభిస్తున్నాయి. సినిమాలు, టీవీ సీరియళ్లు, నెట్ సిరీస్‌లు, యాడ్ ఫిల్మ్స్, రంగస్థలం (థియోటర్ ఆర్ట్స్), షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ, టెలీఫిల్మ్‌లు, వెబ్‌డిజైనింగ్, యానిమేషన్, మల్టిమీడియా కంపెనీలు, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ వీడియో షేరింగ్ సైట్లలో చాన్స్‌లు లభిస్తాయి. ఈ రంగంలో లభించేది శాలరీ కాదు రెమ్యూనరేషన్. ప్రాజెక్ట్‌ను బట్టి దానికి పనిచేసే టెక్నీషియన్లు, ప్రొఫెషనల్స్‌కు వేల నుంచి లక్షలు, కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఉంటుంది. ముఖ్యంగా స్వయం ఉపాధి పొందే అవకాశం ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది.
యాక్టింగ్: చక్కని హావభావాలు పలికిస్తూ, సందర్భానుసారంగా, పాత్రకు తగినట్లు నటించగలిగిన వారు సులువుగా జూనియర్ ఆర్టిస్ట్‌లు, కథానాయకులు, కథానాయికలు అయిపోవచ్చు. ఇటీవల కాలంలో నటనలో మెళకువలు తప్పనిసరి అయ్యాయి. కాబట్టి యాక్టింగ్‌లో డిప్లొమా, సర్టిఫికెట్, ఇతర ఫిల్మ్ స్టడీస్ చదివిన వారు నటులుగా మారుతున్నారు. సాధారణ నటులు కూడా టాలెంట్‌ను బట్టి నెలకు 30 వేల నుంచి లక్ష రూపాయల దాకా ఆర్జించవచ్చు. మంచి గుర్తింపు తెచ్చుకుంటే రెమ్యూనరేషన్ కోట్లలో ఉంటుంది.
డైరెక్టర్: సినిమాకు మార్గదర్శకుడు డైరెక్టర్. సృజనాత్మకత, ఊహాశక్తి కలిగి ఉన్నవారు డైరెక్టర్‌గా రాణించవచ్చు. స్క్రిప్ట్ పర్యవేక్షణ–సమన్వయం, ఆకట్టుకునే సీన్స్ తీయడం, విషయాన్ని కొత్తగా చెప్పడం, స్ర్కీన్ ప్లే, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి ఆల్‌రౌండ్ టాలెంట్ ఉంటే అనతికాలంలో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందవచ్చు. సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌లో అత్యంత సహనం, శ్రమ, ఒత్తిడి కలిగిన జాబ్ ఇది అని చెప్పవచ్చు. మొదట్లో అప్రెంటిస్‌లా, అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ గా చేస్తూ డైరెక్టర్ గా ఎదగవచ్చు. రెమ్యూనరేషన్ డైరెక్టర్ టాలెంట్, గత విజయాలు వంటి వాటి ఆధారంగా వేల నుంచి కోట్ల వరకు ఉండొచ్చు.
స్క్రీన్‌ప్లే / స్ర్కిప్ట్ రైటింగ్
ఒక్కోసారి డైరెక్టరే స్ర్కీన్‌ప్లే, స్ర్కిప్ట్ రైటింగ్ వంటివి చేయాల్సి ఉంటుంది. కథను, దానికి తగినట్లు సీన్లు, పాత్రలను ఎప్పుడు, ఎలా ప్రజెంట్ చేయాలో స్ర్కీన్‌ప్లే రైటర్ నిర్ణయిస్తాడు. అంటే ప్రారంభం నుంచి ముగింపు దాకా ఎప్పుడు ఏ సీన్ రావాలి? ఎవరు ఏం మాట్లాడాలి? వంటివి ఒక స్ర్కిప్ట్ రూపంలో ప్రజెంట్ చేస్తారన్నమాట. రచన అంటే ఆసక్తి ఉండి, సాహిత్యం లేదా లాంగ్వేజ్ లో డిగ్రీ చేసిన వారు స్ర్కిప్ట్/స్టోరీ రైటర్లుగా రాణించవచ్చు.
సినిమాటోగ్రాఫర్: కథ, పాత్రకు తగినట్లుగా ఆకట్టుకునే సీన్ చిత్రీకరించడం సినిమాటోగ్రాఫర్ బాధ్యత. నటుల బాడీ లాంగ్వేజ్, సీన్ బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్ ఆధారంగా షూట్ చేయాలి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఆసక్తి ఉండి మెళకువలు తెలుసుకుంటే సినిమాటోగ్రాఫర్‌గా రాణించవచ్చు. వీరికి సినిమాలు, టెలివిజన్లు, యాడ్ ఏజెన్సీలు వంటి మూవీ ప్రొడక్షన్ అండ్ డిస్ర్టిబ్యూషన్ కంపెనీల్లో ఉపాధి లభిస్తుంది. అసిస్టెంట్ కెమెరామెన్, అసోసియేట్ కెమెరామెన్ గా పనిచేస్తూ అనుభవం, టాలెంట్‌తో సినిమాటోగ్రాఫర్‌గా ఎదగవచ్చు. అసిస్టెంట్ స్థాయిలో కనీసం నెలకు 20 వేల దాకా సంపాదించుకునే అవకాశం ఉంది
కొరియోగ్రాఫర్: అందంగా, ఆకట్టుకునేలా డ్యాన్స్ చేయించడం, స్టెప్పులేయించడం కొరియోగ్రాఫర్ బాధ్యత. మ్యూజిక్‌కు తగినట్లుగా బాడీ మూవ్మెంట్స్ ఉండేలా చూసుకోవాలి. ఆసక్తి, అంకితభావం, కఠినశ్రమ చేయగలిగితే విద్యార్హతతో సంబంధం లేకుండా ఎవరైనా డ్యాన్సర్‌గా రాణించవచ్చు. నిత్యం క్రమశిక్షణ కలిగి ఎల్లప్పుడూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. సినిమాలు, స్టేజీ షోలు, ఇతర ప్రోగ్రాముల్లో డ్యాన్సర్‌గా చేస్తూ రోజుకు 3 నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చు. అంకితభావంతో నిరంతర సాధన ఉంటే మంచి కొరియోగ్రాఫర్ గా రాణించవచ్చు. ఈ దశలో రెమ్యూనరేషన్ లక్షల్లోనే ఉంటుంది.
ఎడిటింగ్: సినిమా, టెలివిజన్ ప్రొడక్షన్, యాడ్ ఫిల్మ్.. ఇలా ఏదైనా షూటింగ్ ఎంత ముఖ్యమో.. పోస్ట్ ప్రొడక్షన్ లేదా ఎడిటింగ్ అంత ముఖ్యం. రా ఫార్మాట్‌లో తీసిన సీన్స్‌కు గ్రాఫిక్స్, ఇతర ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ ఫైనల్ కాపీని తయారు చేయడం ఎడిటర్ బాధ్యత. ఆర్టిస్టిక్, టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఎడిటర్‌గా రాణించవచ్చు. ఇందుకు గాను ఆడోబ్ ప్రీమియర్, అవిడ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఆపిలస్ ఫైనల్ కట్ ప్రో వంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు నేర్చుకోవాల్సి ఉంటుంది.
మ్యూజిక్ డైరెక్టర్: ఎంటర్టైన్మెంట్ రంగంలో జానపద సంగీతం మొదలుకొని వెస్ర్టన్, పాప్ వరకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలాంటి సినమా లేదా యాడ్ ఫిల్మ్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే సంగీతం ముఖ్యం. ఇందుకు గాను పదుల సంఖ్యలో మ్యూజిక్ ఇన్స్ర్టుమెంట్స్పై అవగాహన కలిగి రికార్డింగ్‌పై నాలెడ్జ్ ఉండాలి. సన్నివేశానికి తగినట్లు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాలి. దీనికి ప్రత్యేక కోర్సులు చేయకున్నా సంగీతంపై ఆసక్తి ఉండి కఠినంగా సాధన చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించవచ్చు.
సౌండ్ ఇంజినీర్: ఔట్‌డోర్, ఇండోర్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో పాటు రికార్డింగ్, మిక్సింగ్ ఎడిటింగ్, రీప్రొడక్షన్ వంటివి సౌండ్ ఇంజినీర్ నిర్వహించే విధులు. సౌండ్ ఇంజనీరింగ్ లేదా ఆడియోగ్రఫీలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఆర్ట్ డైరెక్టర్: సినిమా సెట్స్, లొకేషన్లు, విజిబిలిటీ ఎలా ఉండాలో నిర్ణియించేది ఆర్ట్ డైరెక్టర్. దీనికి పెయింటింగ్ లేదా డ్రాయింగ్‌లో కోర్సులు చేసి సృజనాత్మకతతో చిత్రాలు, గీయగలిగే నైపుణ్యం ఉండాలి.
ఫోటోగ్రాఫర్: సినిమాటోగ్రాఫర్ తో పాటు ఫిల్మ్‌లో ఫోటోగ్రాఫర్ కూడా ముఖ్యమే. సెట్స్, లొకేషన్స్, సీన్స్, యాక్టర్స్, పబ్లిక్ ఇలా అన్ని రకాల ఫోటోలు పోస్ట్ ప్రొడక్షన్, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలకు వినియోగించేలా తీయడం వీరి విధి.
స్టంట్ డైరెక్టర్స్/స్టంట్ ఆర్టిస్ట్: సినిమాల్లో సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ తీయడం స్టంట్ డైరెక్టర్ విధి. ఇందుకు ప్రత్యేక కోర్సులు అవసరం లేదు కానీ మార్షల్ ఆర్ట్స్, కరాటే వంటి విద్యలు నేర్చుకుంటే మంచి కెరీర్ అవకాశాలుంటాయి.
పబ్లిసిటీ డిజైనింగ్: పిల్మ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా సినిమాను ప్రమోట్ చేయాలో నిర్ణయించేది పబ్లిసిటీ డిజైనర్. ఇందుకు గాను యాడ్స్ ఇవ్వడం, క్యాంపెయిన్లు నిర్వహించడం, స్టేజీ షోలు ఏర్పాటు చేయడం వంటివి పబ్లిసిటీ డిజైనర్ చేస్తాడు.
మేకప్: నటీనటులను అందంగా తయారు చేయడంలో మేకప్‌మెన్, మేకప్వుమెన్లది కీలకపాత్ర. సందర్భానికి తగినట్లు వారిని అందంగా లేదా అసహ్యంగా అలంకరించాలి. బ్యూటీషియన్ కు సంబంధించిన షార్ట్‌టెర్మ్ కోర్సులు చేస్తే సరిపోతుంది.
కాస్ట్యూమ్ డిజైనర్: నటులకు పాత్రకు తగిన దుస్తులు, ఇతర యాక్సెసరీస్‌ను సిద్దం చేసేది కాస్ట్యూమ్ డిజైనర్లే. ఇందుకు ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన వారు అర్హులు. ఫ్యాషన్ రంగలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను తెలుసుకుంటూ అందరికీ నప్పే కాస్ట్యూమ్స్ తయారు చేయాల్సి ఉంటుంది.
వీటితో పాటు ఎటువంటి కోర్సులు, విద్యార్హతలు అవసరం లేని లేదా ఏదో ఒక విద్యార్హతతో రాణించే జూనియర్ ఆర్టిస్ట్, ఔట్‌డోర్ లైట్‌మెన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ వుమెన్, టెక్నికల్ యూనిట్, స్టూడియో వర్కర్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్స్/సెట్ అసిస్టెంట్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సినిమా డ్రైవర్స్ వంటి అనేక రకాల జాబ్స్, ఉపాధి అవకాశాలు ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ర్టీలో ఉంటాయి.
కోర్సులు – ఇన్స్టిట్యూట్లు
ఎఫ్టీఐఐ
ఫిల్మ్ స్టడీస్ అండ్ కెరీర్స్ గురించి తెలుసుకునే క్రమంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) గురించి తప్పక తెలుసుకోవాలి. దీనిని 1960లో సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆడియో విజువల్ మీడియాకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పేరుగాంచిన ఎఫ్ఎఫ్టీఐ ఫిల్మ్ స్టడీస్‌లో ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధి గల 5 రకాలు ఫుల్‌టైం కోర్సులు అందిస్తోంది. అవి.. పీజీ డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ స్ర్కీన్ ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ సౌండ్ డిజైన్, ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్, స్ర్కీన్ యాక్టింగ్, ఫీచర్ ఫిల్మ్ స్ర్కీన్ ప్లే రైటింగ్. వీటికి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. టెలివిజన్ విభాగంలో ఏడాది వ్యవధి గల పీజీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ డైరెక్షన్, ఎలక్ర్టానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ టెలివిజన్ ఇంజినీరింగ్ వంటి నాలుగు రకాలు కోర్సులు ఆఫర్ చేస్తుంది. వీటికి కూడా ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఆర్ఎఫ్ఎస్
హైదరాబాద్‌లో ని రామానాయుడు ఫిల్మ్ స్కూల్.. ఫిల్మ్ స్టడీస్‌లో సర్టిఫికెట్, బ్యాచిలర్, డిప్లొమా, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తుంది. డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (డీఎఫ్టీ), డిప్లొమా ఇన్ డైరెక్షన్ అండ్ స్ర్కీన్ రైటింగ్, డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, మాస్టర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వంటి కోర్సులను జేఎన్ఎఫ్ఏయూ గుర్తింపుతో ఆఫర్ చేస్తుంది. ఇందులో డిగ్రీ ప్రోగ్రాములకు 10+2 ఉత్తీర్ణత సాధించాలి. డిప్లొమా కోర్సులు సంవత్సరం, డిగ్రీకి నాలుగు, మాస్టర్స్ కి 2 సంవత్సరాల కాలవ్యవధి ఉంది.
జేఎన్ఎఫ్ఏయూ
సినిమా రంగంలో అర్హతగా పరిగణించే పలు కోర్సులను జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ(జేఎన్ఎఫ్ఏయూ) అందిస్తోంది. పెయింటింగ్, ఫోటోగ్రఫీ, యానిమేషన్, అప్లయిడ్ ఆర్ట్లలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రాములును ఆఫర్ చేస్తుంది. డిగ్రీ కోర్సులకు ఇంటర్/తత్సమానం, పీజీకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
తెలుగు విశ్వవిద్యాలయం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎంఎ కర్ణాటక సంగీతం, డిప్లొమా–లలిత సంగీతం, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ఆర్ట్స్, డిప్లొమా ఇన్ కూచిపూడి, ఫోక్ డ్యాన్స్, ఫోక్ మ్యూజిక్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, మాస్టర్స్ ప్రోగ్రాములు, పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్, మాస్టర్స్, డిప్లొమా ఇన్ థియోటర్ ఆర్ట్స్, బీఎఫ్ఏ పెయింటింగ్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తుంది. ఎంట్రన్స్ నిర్వహించి ప్రవేశాలు కల్పించే ఈ కోర్సులకు ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఆయా అంశాల్లో ప్రావీణ్యం లేదా అవగాహన కలిగి ఉండాలి.
ఇతర ఇన్స్టిట్యూట్లు
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా www.srfti.ac.in
రూప కళా కేంద్ర, కోల్‌కతా www.kendroonline.org
డిజిటల్ అకాడమీ – ది ఫిల్మ్ స్కూల్, ముంబయి www.dafilmschool.com
స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో, హైదరాబాద్ www.stepsdanz.com
ఎఫ్టీఐఏపీ, హైదరాబాద్ www.filmandtelevisioninstituteofandhrapradesh.com
Film studies career:సినిమా రంగంలో కెరీర్ ఛాన్స్‌లు