Trending Posts

INDIA SOILS: భారతదేశ మృతికలు–రకాలు

భారతదేశం – నేలలు

భూమిపై వృక్ష జాతుల పెరుగుదల, పంటలు పండటం, నీటి సంరక్షణలో నేలలు కీలకపాత్ర పోషిస్తాయి. తద్వారా ఒక దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. అలాగే పలు పోటీ పరీక్షల్లోనూ మృత్తికలపై ప్రశ్నలు వస్తూ జాబ్​ను డిసైడ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని నేలలు రకాలు, వాటి ఏర్పాటు, నేలల ధర్మాల తదితర సమాచారం క్షుణ్నంగా చదువుకుంటే మంచి స్కోర్​ సాధ్యం అవుతుంది.

నేలలు ఏర్పడే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘లిథాలజీ’ అని, నేలల భౌతిక, రసాయనిక ధర్మాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. మృత్తికలు ఏర్పడే విధానం, ఏర్పడే ప్రాంతం, అక్కడి శీతోష్ణస్థితిని ఆధారంగా చేసుకొని నేలలను వివిధ రకాలుగా విభజించారు. అందులో నేలలు ఏర్పడే విధానాన్ని బట్టి 2 రకాలుగా వర్గీకరించారు. అవి..

  1. స్థానబద్ధ మృత్తికలు: శిలాశైథిల్యం కారణంగా ఏర్పడిన మృత్తిక మాతృశిలా ప్రాంతంపై నిక్షిప్తం కావడం ద్వారా ఏర్పడే వాటిని స్థానబద్ధ మృత్తికలు అంటారు.
    ఉదా: నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు, లాటరైట్‌నేలలు, సేంద్రియ నేలలు.
  2. పరస్థానీయ మృత్తికలు: బహిర్జనిత బలాల కారణంగా రవాణా చెందే ఒండ్రుమట్టి శిథిలాలు వేరొక ప్రాంతంలో నిక్షేపితం కావడం వల్ల ఏర్పడే నేలలు పరస్థానీయ మృత్తికలు.
    ఉదా: ఒండ్రుమట్టి నేలలు

మృత్తికలు ఏర్పడే ప్రాంత లక్షణాలు, అక్కడి శీతోష్ణస్థితి లాంటి అంశాలను ఆధారంగా చేసుకొని నేలలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి..

I. జోనల్‌ మృత్తికలు: ఇవి ఒక నిర్ధిష్ట భౌగోళిక ప్రాంతంలో మాతృశిలా శైథిల్యం చెందడం వలన ఏర్పడిన నేలలు.
ఉదా: చెర్నోజెమ్స్‌, పాడ్‌జోల్‌, లాటరైట్‌, ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు.

II. ఇంట్రాజోనల్‌మృత్తికలు: నీటిలోపల కరిగిన లవణాలు భూమిలోపల నుండి కేశనాళికీయత ప్రక్రియ ద్వారా భూమి ఉపరితలంపైకి చేరినప్పుడు అందులోని నీరు ఆవిరైపోగా మిగిలిన లవణాలు గడ్డకట్టి ఏర్పడిన నేలలు ఇంట్రాజోనల్​ నేలలు.
ఉదా: క్షారమృత్తికలు, పీట్​ నేలలు, టెర్రరోపా నేలలు.

III. అజోనల్ మృత్తికలు: బహిర్జనిత బలాల కారణంగా ఒండ్రుమట్టి లాంటి శిథిలాలు ఒక ప్రాంతం నుండి రవాణా కాబడి మరొక ప్రాంతంలో విక్షేపణం చెందడం వలన ఏర్పడిన నేలలు అజోనల్​ మృత్తికలు.
ఉదా: లోయస్‌ నేలలు, ఒండ్రునేలలు

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (Indian Coucil of Agricultural Reaserch-icAr) భారతదేశంలోని నేలలను 8 కరాలుగా వర్గీకరించింది. అవి..

  1. ఒండ్రుమట్టి నేలలు: ఇవి అత్యంత సారవంతమైన నేలలు. దేశ భూభాగంలో 22.16 శాతం (7.7 లక్షల చదరపు కి.మీ.) విస్తరించి ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుండి నదులు తీసుకువచ్చిన విభిన్న రకాల ఖనిజ పోషకాలతో నిక్షేపించిన నేలలు ఒండ్రుమట్టి నేలలు. గంగా–సిధూనది డెల్టా, బ్రహ్మపుత్ర డెల్టా, ఒడిశాలోని మహానది డెల్లా, ఆంధ్రపదేశ్‌లోని కృష్టా–గోదావరి డెల్టా, కేరళలోని పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో నర్మద,తపతి నదీలోయ ప్రాంతంలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో పోటాష్‌, సున్నం, పాస్ఫారిక్‌ ఆమ్లాలు, ఎక్కువగా ఉండి నత్రజని, హ్యుమస్‌ లోపించి ఉంటాయి. పాత ఒండ్రుమట్టి నేలలను భంగర్‌ అని, కొత్త ఒండ్రుమట్టి నేలలను ఖాదర్‌ అని అంటారు.
  2. నల్లరేగడి నేలలు: ఈ నేలలకు నల్లరంగు రావడానికి కారణం అందులో కరిగి ఉన్న ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్‌. ఇవి ప్రధానంగా బసాల్ట్‌ శిలలు విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడ్డాయి. అమెరికాలోని చెర్నోజెమ్‌ నేలలను పోలి ఉండే నల్లరేగడి నేలలను రేగర్‌ నేలలని, తనని తాను దున్నుకొనే నేలలు అని కూడా పిలుస్తారు. ఇవి పత్తి పంటకు అత్యంత అనుకూలమైనవి. దేశ భూభాగంలో దాదాపు 29.69 శాతం ఆక్రమించి ఉన్నాయి. ఎక్కువగా మహారాష్ర్టలోని మాల్వాపీఠభూమి, తమిళనాడులోని కోయంబత్తూర్, ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం, నంద్యాల ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. నేలలన్నింటిలో నీటిని నిలుపుకునే సామర్థ్యం వీటికే ఎక్కువ. వర్షం పడినప్పుడు జిగటగా ఉబ్బి ఉండటం, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పగుళ్లు ఏర్పడటం ఈ నేలల ప్రత్యేకత. వీటిలో నత్రజని, పాస్ఫరస్​, హ్యూమస్​ తక్కువగా ఉంటాయి.
  3. ఎర్రనేలలు:‌‌ ఈ నేలలు ఎక్కువగా తమిళనాడులో విస్తరించి ఉన్నాయి. దేశ భూభాగంలో దాదాపు 28 శాతం ఆక్రమించి ఉన్న ఎర్రనేలలు ప్రధానంగా గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడ్డాయి. ఇవి ఎర్రటి రంగులో ఉండటానికి కారణం అందులో కరిగి ఉన్న ఐరన్ ఆక్సైడ్. ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, చత్తీస్​ఘడ్, జార్ఖండ్, అస్సాం రాష్ర్టాలలో ఇవి విస్తరించి ఉన్నాయి.
  4. లాటరైట్ నేలలు: ఇవి దేశ భూబాగంలో 2.62 శాతం ఆక్రమించి ఉన్నాయి. పర్వత శిఖర భాగాలు, పీఠభూమి ప్రాంతాలలో ఏర్పడ్డాయి. లీచింగ్ అనే భూస్వరూప ప్రక్రియ ద్వారా రూపుదిద్దుకునే లాటరైట్​ నేలలు ఇటుక ఎరుపు వర్ణంలో ఉంటాయి. కారణం ఇందులో కరిగి ఉన్న ఇనుము, ఐరన్ ఆక్సైడ్. అధిక వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఒకదాని తరువాత ఒకటి సంభవించే ప్రాంతాలలో ఏర్పడుతాయి. కేరళలోని పశ్చిమ కనుమల శిఖర భాగాలు, మధ్యప్రదేశ్​లోని వింధ్య, సాత్పూరా పర్వత ఉపరితలాలు, తెలంగాణలోని మెదక్ జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్ మరియు ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో సత్యవేడు, నెల్లూరు జిల్లా కావలి, సూళ్లూరుపేట, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలోని తూర్పు కనుమలు మరియు అస్సాం, మేఘాలయా, జార్ఖండ్ రాష్ర్టాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి కాఫీ, తేయాకు, జీడిమామిడి, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు వంటి పంటలకు అత్యంత అనుకూలమైనవి.
  5. ఎడారి ఇసుక నేలలు: ఈ నేలల్లో నత్రజని, హ్యుమస్ లోపించి ఉంటాయి. శుష్క, అర్ధశుష్క శీతోష్ణస్థితి గల దేశ వాయువ్వ ప్రాంతాలలో తీర ప్రాంతాల వెంట ఇవి విస్తరించి ఉన్నాయి. వీటికి నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం అతి తక్కువ. పాస్ఫరస్ సమృద్ధిగా కలిగిన ఇసుక నేలలు దేశ భూబాగంలో 6.13 శాతం ఆక్రమించి ఉన్నాయి. వీటిలో నీటి పారుదల సౌకర్యం కల్పించగలిగితే గోధుమ, బార్లీ పంటలకు అత్యంత అనుకూలమైనవి.
  6. క్షార మృత్తిక నేలలు: ఇవి దేశ భూభాగంలో 1.29 శాతం ఆక్రమించి ఉన్నాయి. సోడియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్​లు, కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ లవణాలు వీటిలో ఎక్కువగా కరిగి ఉంటాయి. గంగా మైదాన వాయువ్వ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్న ఈ నేలలను రే/కల్లార్/ఊసరనేలలు అని కూడా పిలుస్తారు.
  7. పర్వత ప్రాంత నేలలు: ఇవి దేశ భూభాగంలో 7.94 శాతం ఆక్రమించి ఉన్నాయి. వీటిలో హ్యుమస్ ఎక్కువ. హిమాలయ, వింధ్య, సాత్పూర, తూర్పు, పశ్చిమ కనుమల వాలుల్లో ఎక్కువగా విస్తరించి ఉన్న పర్వత ప్రాంత నేలలు కాఫీ, తేయాకు తోటలకు అత్యంత అనుకూలమైనవి.
  8. పీట్ లేదా జీవ సంబంధ మృత్తికలు: జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడం వలన ఈ నేలలు ఏర్పడ్డాయి. ఇవి తేమ, బురదతో కూడిన నేలలు. అందువల్ల ఇవి వ్యవసాయానికి అనుకూలంగా ఉండవు. దేశ భూభాగంలో 2.17 శాతం విస్తీర్ణాన్ని ఈ నేలలు ఆక్రమించి ఉన్నాయి. కేరళలోని అలెప్పీ, కొట్టాయం జిల్లాల్లో గంగా మైదానంలోని గెరాయ్ ప్రాంతం, తమిళనాడులోని తీర ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. కేరళలో పీట్ నేలలను స్థానికంగా కరినేలలు అని పిలుస్తారు.

మృత్తికా క్రమక్షయం

భారత వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలలో మృత్తికా క్రమక్షయం ప్రధానమైనది. నదులు, పవనాలు, శీతోష్ణ పరిస్థితులు వంటి సహజ కారణాల వల్ల మెత్తని, సారవంతమైన పై పొర కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు. దేశంలో 175 మిలియన్​ హెక్టార్ల భూమి క్రమక్షయానికి లోనవుతుంది. సరాసరిగా ప్రతి హెక్టారుకి 16.4 టన్నుల మృత్తికను కోల్పోతున్నాం. దేశంలో 69 మిలియన్​ హెక్టార్లలో ఎర్రనేలలు, 67 మిలియన్​ హెక్టార్లలో నల్లరేగడి నేలలు పట క్రమక్షయానికి లోనవుతున్నాయి. నదీ ప్రవాహాల వల్ల జరిగే మృత్తికా క్రమక్షయాన్ని నాలుగు రకాలుగా విభజించారు. అవి..

i) పట క్రమక్షయం: కుండపోత వర్షాలకు, వరదలకు విశాల ప్రాంతంలోని మృత్తిక పొరలు, పొరలుగా కొట్టుకుపోవడాన్ని పట క్రమక్షయం అంటారు. ఇది శివాలిక్​ కొండలు, పశ్చిమ మరియు తూర్పు కనుమలు, ఈశాన్య రాష్ర్టాలలో ఎక్కువగా ఉంది.

ii) వంక క్రమక్షయం: పట క్రమక్షయం ఎక్కువ కాలం కొనసాగితే చేతి వేళ్ల ఆకారంలో అనేక గాడులు ఏర్పడుతాయి. దీనిని ‘వంక క్రమక్షయం’ అంటారు. ఇది బీహార్​, ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

iii) అవనాళికా క్రమక్షయం: వంక క్రమక్షయం ఇంకా కొనసాగితే లోతైన పెద్దదైన లోయలు ఏర్పడుతాయి. దీనిని ‘అవనాళికా క్రమక్షయం’ అంటారు. ఇది మహి, చంబల్​, యమునా నది ప్రాంతంలో జరుగుతున్నది.

iv) రిపేరియన్​ క్రమక్షయం: నదీ ప్రవాహాల వల్ల నదీ గట్లు కోసివేయడాన్ని ‘రిపేరియన్​ క్రమక్షయం’ అంటారు. పశ్చిమ బెంగాల్​లో గంగానది కారణంగా రిపేరియన్​ క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది.

క్రమక్షయం–కారణాలు
అటవీ నిర్మూలన
అశాస్ర్తీయ వ్యవసాయ పద్ధతులు
విస్తాపన వ్యవసాయం
పరిమితికి మించి రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం
పోడు వ్యవసాయ విధానాలు

క్రమక్షయ నివారణ చర్యలు
బంజరు భూములలో సామాజిక అడవుల పెంపకం
కాంటూర్​ బండింగ్​ విధానం చేపట్టడం
పొలము సరిహద్దు గట్ల వెంబడి కందకాలు తవ్వడం
ప్రవాహాలకు అడ్డంగా చెక్​ డ్యామ్​ల నిర్మాణం చేపట్టడం
వర్షాభావ ప్రాంతాలలో వాటర్​షెడ్​ పథకాలను అభివృద్ధి పరచడం
పోడు వ్యవసాయాన్ని నియంత్రించాలి.
పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి
భూమి యొక్క వాలుకి అడ్డంగా దున్నాలి
కొడ ప్రాంతాలలో సోపాన వ్యవసాయాన్ని చేపట్టాలి

ప్రాంతీయ మృత్తికా పరిశోధనా కేంద్రాలు
శివాలిక్​ ప్రాంత పరిశోధనా కేంద్రం – చంఢీఘర్​
హిమాలయ ప్రాంత పరిశోధనా కేంద్రం – డెహ్రాడూన్​
రాజస్థాన్​ అవనాళికా ప్రాంత పరిశోధనాకేంద్రం – కోట
యమునా అవనాళికా ప్రాంత పరిశోధనా కేంద్రం – ఆగ్రా
నల్లరేగడి నేలల ప్రాంత పరిశోధనా కేంద్రం – బళ్లారి

INDIA SOILS: భారతదేశ మృతికలు–రకాలు

Leave a Comment