ONE NATION ONE ELECTION
కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకే దేశం–ఎకే ఎన్నిక నినాదంతో జమిలీ ఎన్నికల ప్రణాళిక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు.
ఈ బిల్లును కాంగ్రెస్ సహా సమాజ్‌వాద్ పార్టీ, టీఎంసీ పలు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించగా.. ఎన్డీయే మిత్ర పక్షాలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.. అయితే గత దశాబ్ద కాలంగా వినిపిస్తున్న ‘జమిలి ఎన్నికల అంశం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఎన్నికలు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉండటంతో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల పరిపాలనపై దృష్టి కేంద్రీకరించడానికి వీలు పడటం లేదు. ఫలితంగా అభివృద్ధి కార్యకాలపాలు కుంటుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యయం తగ్గించడంతోపాటు పరిపాలన సాఫీగా సాగేందుకు పరిష్కార మార్గంగా సూచించిందే జమిలి ఎన్నికలు.
లోక్‌సభ, అన్ని రాష్ర్టాల శాసన సభలకు జమిలి ఎన్నికలు (ఒకేసారి ఎన్నికలు) నిర్వహించాలని ఎన్నికల సంఘం 1983లోనే అభిప్రాయపడింది. భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే జమిలి ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జూన్ 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాటి అభిప్రాయాలను తెలుసుకున్నారు. త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.
జమిలి చరిత్ర
స్వాతంత్ర్యానంతరం 1951–52లో లోక్‌సభ, అన్ని రాష్ర్టాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అనంతరం రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ, ముందస్తు రద్దు తదితర కారణాలతో 1957లో 76 శాతం, 1962, 1967లో 67 శాతం మాత్రమే జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో చాలా రాష్ర్ట ప్రభుత్వాలు కాలపరిమితికి ముందే రద్దు కావడం, 1970లో లోక్‌సభ రద్దుతో జమిలి ఎన్నికల అంశం కనుమరుగైంది. నీతి ఆయోగ్ విశ్లేషణ ప్రకారం గత 30 ఏళ్లలో ఏదో ఒక రాష్ర్ట అసెంబ్లీకి /లోక్ సభకు లేదా రెండిటికీ ఎన్నికలు లేని సంవత్సరం ఒకటి కూడా లేదు.
కమిటీలు – సిఫారసులు
మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమీషన్ 1999లో లోక్‌సభ, అన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నిలు ఒకేసారి నిర్వహించాలని సూచించింది. అలాగే లోక్‌సభ మరియు రాష్ర్ట అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే ఆయా పార్టీలు ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని కూడా పెట్టాలని సిఫార్సు చేసింది.
రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణానికి భంగం కలగకుండా ఏకకాల ఎన్నికలకు సంబంధించిన సవరణలు చేయవచ్చని జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ సమీక్ష జాతీయ కమీషన్ 2002లో సిఫారసు చేసింది.
సిబ్బంది, ప్రజా సమస్యలు, చట్టం మరియు న్యాయంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2015లో విడుదల చేసిన తన 79వ నివేదికలో జమిలి నిర్వహణకు ప్రత్యామ్నాయ, ఆచరణాత్మక పద్ధతిని సిఫారసు చేసింది.
లా కమీషన్ యొక్క 255వ నివేదిక జమిలి ఎన్నికలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి చేయవలసిన సవరణలు సూచించింది.
2015 డిసెంబర్లో అప్పటి రాజ్యసభ ఎంపీ ఈఎంఎస్ నాచియప్పన్ (కాంగ్రెస్) నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఏకకాల ఎన్నికలను సిఫారసు చేసింది. అప్పటివరకు 16 లోక్‌సభల్లో 7 లోక్‌సభలు పదవీకాలానికి ముందే రద్దయ్యాయని ఇందుకు సంకీర్ణ ప్రభుత్వాల విభేదాలే కారణమని కమిటీ విశ్లేషించింది.
నీతి ఆయోగ్ 2017 సంవత్సరంలో విడుదల చేసిన చర్చాపత్రంలో ఏకకాల ఎన్నికలను సమర్థిస్తూ కేంద్రంలోగానీ రాష్ర్టాలలోగానీ కాలపరిమితికి ముందే రద్దు కాబడిన ప్రభుత్వాలను మిగిలిన కాలానికి రాష్ర్టపతి పాలించాల్సిందిగా సిఫారసు చేసింది. అలాగే 2021లో 2 విడతలుగా జమిలి ఎన్నికల నిర్వహణకు సూత్రప్రాయ ప్రతిపాదన చేసింది.
పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైతే రాజ్యాంగ సవరణతో నిమిత్తం లేకుండా 10 నుంచి 15 ఏళ్ల కాలంలో జమిలి ఎన్నికల విధానాన్ని సాధ్యం చేయవచ్చని స్థాయి సంఘం పేర్కొన్నది.
మూడు సార్లు లోక్‌సభ సెక్రెటరీ జనరల్‌గా పనిచేసిన సుభాష్ కశ్యప్ రాజ్యాంగం పనితీరును పరిశీలించడానికి ఏర్పాటైన కమీషన్లో సభ్యుడిగా పనిచేశారు. ఇతను జమిలి ఎన్నికలకు రాజ్యాంగ సవరణ తప్పదని, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే రాజ్యాంగ సవరణ అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
ప్రధాని నరేంద్రమోదీ 2017 జనవరిలో జమిలి ఎన్నికలను ప్రతిపాదించి అదే ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రులతో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలో సాధ్యాసాధ్యాలను వివరించారు.
లా కమీషన్ ముసాయిదా నివేదిక 2018
బీఎస్ చౌహాన్ అధ్యక్షతన గల లా కమీషన్ ఏకకాల ఎన్నికలపై దేశవ్యాప్తంగా అభిప్రాయాలను సేకరించి జమిలి ఎన్నికలకు మద్ధతుగా కొన్ని సిఫారసులను చేసింది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ర్టాలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనకు లా కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు భారత రాజ్యాంగంలోని 172వ నిబంధనకు సవరణ అవసరమని తెలిపింది.
కమీషన్ నివేదిక ప్రకారం 13 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికలను 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటే నిర్వహించవచ్చు.
మిగిలిన 16 రాష్ర్టాలకు 2021 సంవత్సరంలో నిర్వహించి వాటి పదవీకాలం 30 నెలలు లేదా జూన్ 2024 వరకు కొనసాగేలా చూడాలని సూచించింది. ఆ తర్వాత 2024 నుండి జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని నివేదించింది.
అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రభుత్వం మధ్యలోనే రద్దయిన సందర్భంలో అధికారం చేపట్టబోయే తదుపరి ప్రభుత్వం మొదటి ప్రభుత్వం యొక్క మిగిలిన కాలానికి మాత్రమే కొనసాగుతుందని ముసాయిదా నివేదిక పేర్కొన్నది. ఇదే సూత్రం మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన హంగ్అసెంబ్లీ విషయంలో కూడా వర్తిస్తుంది.
పైవన్నీ సాధ్యం కాని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని కూడా కమీషన్ సూచించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోతే ఒక క్యాలెండర్ సంవత్సరంలో వచ్చే అన్ని ఎన్నికలను కలిపి ఒకేసారి నిర్వహించాలని సూచించింది.
ప్రస్తుత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని సూచించాల్సి ఉంటుంది. వీటితో పాటు పార్టీ ఫిరాయింపుల చట్టానికి తగిన సవరణలు చేయాలని ప్రతిపాదించింది.
సవరించాల్సిన నిబంధనలు
లోక్‌సభతో పాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 5 రాజ్యాంగ సవరణలు అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం న్యాయ మంత్రిత్వ శాఖకు నివేదించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లో కూడా మార్పులు చేయాలని పలువురు న్యాయవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ రాజ్యాంగ సవరణలు చేయాలంటే పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు సగానికిపైగా రాష్ర్టాల ఆమోదం తప్పనిసరి.
83 (2) నిబంధన: లోక్‌సభ దాని మొదటి సమావేశం నుండి 5 సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ లోపు రద్దు చేయబడవచ్చు లేదా అత్యవసర పరిస్థితి కాలంలో కాలపరిమితి పెంచవచ్చు.
85 (2) B: భారత రాష్ర్టపతి గడువుకు ముందే లోక్‌సభను రద్దు చేయుట
172 (1): ప్రతి రాష్ర్ట శాసనసభ దాని మొదటి సమావేశం నుండి 5 సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ లోపల కూడా రద్దు కాబడవచ్చు. అత్యవసర పరిస్థితి కాలంలో సభ కాలపరిమితిని పెంచవచ్చు.
174 (2) B: రాష్ర్ట గవర్నర్ శాసన సభను రద్దు చేయుట
356: ఒక రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించుట
ఇతర దేశాలలో ఇలా..
బ్రిటిషు పార్లమెంట్ ‘స్థిరకాల పార్లమెంట్ చట్టం 2011’ ను అమలు చేస్తుంది. దీని ద్వారా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్ణయించబడతాయి.
దక్షిణాఫ్రికా జాతీయ అసెంబ్లీ, ప్రాంతీయ శాసనసభలు మరియు మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలు ఒకేసారి ప్రతి 5 సంవత్సరాలకు జరుగుతాయి.
స్వీడన్లో కౌంటీ కౌన్సిల్ మరియు మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి.
ఇండోనేషియా అధ్యక్ష మరియు శాసనసభ ఎన్నికలు 2019 నుంచి ఒకేసారి జరుగుతున్నాయి.
జర్మనీ, స్పెయిన్, హంగేరీ, బెల్జియం, పోలాండ్, స్లొవేనియా , అల్బేనియా దేశాలలో ఏకకాల ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి.
ప్రయోజనాలు
ఎన్నికల ఖర్చు తగ్గించుట ద్వారా ప్రజాధనం ఆదా
వేగవంతమైన అభివృద్ధి
పాలన యొక్క సమర్థత రెట్టింపు
ఓటింగ్ శాతం పెరుగుట
నల్లధనం తనిఖీ
సమయం, శక్తి ఆదా
భద్రతా దళాలపై భారం తగ్గుట
లోపాలు
సమాఖ్య స్పూర్తికి విరుద్ధం
రాజ్యాంగ సమస్యలు ఉత్పన్నం అవుట
ఎన్నికల ఫలితాలలో ఆలస్యం
సిబ్బంది కొరత, భద్రతాపర సమస్యలు
భారీ సంఖ్యలో యంత్రాలు, వనరులు అవసరం (దాదాపు 24 లక్షల ఈవీఎంలు అవసరం)
జాతీయ పార్టీలకు ప్రయోజనం కలిగి ప్రాంతీయ పార్టీలకు విఘాతం
స్థానిక సమస్యల నిర్లక్ష్యం
జమిలి ఎన్నికలు – సవాళ్లు
ఏకకాల ఎన్నికలు భారత రాజ్యాంగంలోని 6వ భాగాన్ని ఉల్లంఘించినట్లవుతుంది. ఈ భాగంలోని నిబంధనలు కేంద్రం, రాష్ర్టాలకు ప్రత్యేకమైన రాజ్యాంగ హోదా కల్పిస్తున్నాయి. ప్రసిద్ధ కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది రాజ్యాంగ సిద్ధాంతం యొక్క ప్రాథమిక నిర్మాణం యొక్క ఉల్లంఘన అవుతుంది.
368వ నిబంధన ప్రకారం రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణాన్ని మరియు రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వభావాన్ని సవరించడానికి అనుమతిలేదని న్యాయకోవిధుల వాదన.
జమిలి ఎన్నికల్లో ఓటరు ఒకే పార్టీకి ఓటు వేసే అవకాశాలు 77 శాతం ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 సెక్షన్ 14 (2) మరియు 15 (2) ప్రకారం సభ కాలపరిమితికి ముందే రద్దయితే 6 నెలలలోపు ఎన్నికల సంఘం ఎన్నికల నోటిపికేషన్ జారీ చేస్తుంది.
రాజ్యాంగం ప్రకారం రెండు శాసనసభ సమావేశాల మధ్య 6 నెలల కన్నా ఎక్కువ వ్యవధి ఉండకూడదు. సభ రద్దయిన దర్వాత ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘానికి తప్పనిసరి.
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేవారు ప్రత్యామ్నాయ ప్రధాని ఎవరో చెప్పాలన్న నిబంధన ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇది కుదరకపోతే లోక్‌సభ గడువు ముగిసేదాకా రాష్ర్టపతి పాలన విధించాలన్న సూచన ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కేంద్రంలో రాష్ర్టపతి పాలనకు అవకాశం లేదు కాబట్టి దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. బందోబస్తుకు ప్రస్తుతం 800 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమైతే జమిలి ఎన్నికల్లో దాదాపు 3500 కంపెనీల బలగాలు కావాలి. కాబట్టి భద్రతా దళాల ఇతరత్రా విధులకు ఆటంకం ఏర్పడుతుంది.