Trending Posts

TET PREPARATION TIPS:నాన్​మ్యాథ్స్​ స్టూడెంట్స్​.. ప్రిపేర్​అవ్వండిలా..

టీజీ టెట్​–2025

      పోటీ పరీక్షలు ఏవైనా సరే.. నాన్​ మ్యాథ్స్​ స్టూడెంట్స్​ లెక్కలు చేయాలంటే భయపడుతుంటారు. అసలు మ్యాథ్స్​ జోలికి పోకుండా మిగతా సబ్జెక్టుల్లో స్కోర్​ సాధించేందుకు కష్టపడతారు. చివరికి కొద్ది మార్కుల తేడాతోనే ఉద్యోగావకాశాలు కోల్పోయి బాధపడుతుంటారు. 

ఇందుకు ప్రధాన కారణం అన్ని సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్​ను చదవకపోవడమే.. సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన ఉండి కూడికలు తీసివేతలు, గుణకారం, భాగహారం, సూత్రాలు, ట్రిక్స్​ తెలిస్తే చాలా ప్రశ్నలకు సమాధానం రాబట్టవచ్చనే విషయాన్ని అభ్యర్థులు తెలుసుకుంటే నాన్​మ్యాథ్స్​ అభ్యర్థులు కూడా మ్యాథ్స్​లో మంచి మార్కులు సాధించవచ్చని సబ్జెక్ట్ నిపుణులు సూచిస్తున్నారు.

టీజీ​ టెట్‌ విషయానికొస్తే  పేపర్​–1కు ​ సంబంధించి మ్యాథ్స్​కు  24 మార్కుల కంటెంట్​ ఉంటుంది. మిగతా సబ్జెక్టులతో పోలిస్తే 24/24 మార్కులు  సాధించడానికి స్కోప్​ ఉన్న ఏకైక సబ్జెక్ట్ కేవలం మ్యాథ్స్​ మాత్రమే.. పేపర్​–1 రాసే అభ్యర్థులు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలు చదివితే చాలు.  సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితం, సాంఖ్యకశాస్త్రం,   

1. టెట్​ సిలబస్​ ప్రకారం పేపర్​–1లో మొదటి టాపిక్​ సంఖ్యా వ్యవస్థ ఇందులో  కూడికలు, తీసివేతలు, భాగాహారం, గుణకారం. 20 వరకు ఎక్కాలు, బేసిక్​ ఫార్మూలాలు తెలిసి ఉంటే మొత్తం మ్యాథ్స్​ ఈజీగా చేయవచ్చు. మ్యాథ్స్​లో ప్రశ్నను అర్ధం చేసుకుంటే 80 శాతం లెక్క చేసినట్టే. అందుకే ఇచ్చిన ప్రశ్నను ఒకటికి రెండు చదివి అర్ధం చేసుకోవాలి. ప్రశ్న కింద ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగా కూడా సరైన జవాబును తక్కువ సమయంలో రాబట్టవచ్చు.

2. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అర్థమెటిక్​, రీజనింగ్ సంబంధించిన లెక్కల షార్ట్​కట్స్​, ట్రిక్స్​ కోసం ఆర్​ఎస్​ అగర్వాల్​ తెలుగు అనువాదం పుస్తకం తీసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇందులో ఈజీ మెథడ్​లో, అతి తక్కువ సమయంలో సమస్యల సాధనకు ఉపయోగపడే సూత్రాలు, ట్రిక్స్​ వివరంగా ఉదాహారణ లెక్కలతో సహా వివరించారు.

3. సరి, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు,  భిన్నాలు, నిష్పత్తులు, అకరణీయ, కరణీయ సంఖ్యలు, క.సా.గు, గ.సా.భా, అవపాతం టాపిక్​ సంబంధించిన లెక్కలు గత టెట్​లలో ఎక్కవ సార్లు అడిగారు. ఈ టాపిక్​లన్నీ ప్రాథమిక స్థాయిలో ప్రతి అభ్యర్థి చదువుకున్న అంశాలే. కాబట్టి ఒకసారి వాటిని సాధన చేస్తే పరీక్షల్లో మార్కులు మిస్​ కాకుండా ఉంటాయి.

4. పాఠ్యపుస్తకాల వెనకాల ఉన్న ఉదాహారణ లెక్కలను సాధన చేస్తే సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.  రెండు, మూడు నమూనాలకు సంబంధించిన లెక్కలను ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్​ చేస్తే పరీక్ష సమయంలో వేగంగా, కచ్చితంగా సమాధానాలు రాబట్టవచ్చు.

5. 2011 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన ఆరు టెట్‌లలో పేపర్​–1లో మ్యాథ్స్​ నుంచి రెండు, మూడు బిట్లు మినహా మిగతావన్నీ ప్రశ్నలు ప్రాథమిక అంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలడిగారు. కానీ నాన్​ మ్యాథ్స్​ అభ్యర్థులు సబ్జెక్ట్​పై భయంతో చదవకపోవడంతో ఈజీ ప్రశ్నలకు కూడా మార్కులు కోల్పోయారు.

ఉదాహరణకు గత టెట్​లలో ఇచ్చిన కింది లెక్కలు పరిశీలించవచ్చు.

* ఒక చొక్కాకు 2మీ.60 సెం.మీ గుడ్డ అవసరమైనచో 7 చొక్కాలకు అవరమగు గుడ్డ ఎంత?

​1. 14.మీ.80సెం.మీ

2. 18మీ.20 సెం.మీ

3. 15మీ.20 సెం.మీ

4. 16మీ.80 సెం.మీ

(జవాబు: 18మీ.20సెం.మీ)

పై లెక్కలో అభ్యర్థులకు గుణకారం పై అవగాహన ఉంటే చాలు. ఒక చొక్కకు అవసరమైన గుడ్డ , 7 చొక్కాలకు అవసరమైన గుడ్డ ఎంత గుణిస్తే జవాబు వస్తుంది.  (2.60×7=18.20)

*  అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇచ్చినా.. సెలవులు 49 రోజులైన పాఠశాల పున: ప్రారంభం అయ్యే తేదీ ఏదీ

1. జూన్​ 11

2. జూన్​ 12

3. జూన్​ 10

4. జూన్​ 13

(జవాబు: జూన్​ 12)

పై లెక్కలో అభ్యర్థికి క్యాలెండర్​ లో ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో అవగాహన ఉంటే ఈజీగా జవాబు రాబట్టవచ్చు.

* 6కి.గ్రా మామిడి పండ్ల వెల రూ. 84 అయిన 7 1/2 కి.గ్రా మామిడి పండ్ల వెల ఎంత?

1.106

2.107

3.105

4.108

(జవాబు: 105)

( పై లెక్కలో ఆరు కిలోల ధర ఇచ్చి ఏడున్నర కిలోల ధర అడిగాడు. ఇందులో ఒక కిలో ధరను కనుక్కుంటే జవాబును సాధించవచ్చు. ఇది కూడా గుణకారానికి సంబంధించినదే..)

* ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు కలరు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరినా ఉపాధ్యాయులు , విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉండుటకు అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత?

1.25

2.23

3.20

4.30

(జవాబు: 20)

* టెట్​ పరీక్ష రాసే నాన్​మ్యాథ్స్​ అభ్యర్థులు భయాన్ని వీడి సాధన చేస్తే స్కోర్​ పెంచుకోవచ్చు. పోటీ పరీక్షల్లో ప్రతి మార్కు కీలకమే కాబట్టి   అర్థం కాని విషయాన్ని పలుమార్లు ప్రాక్టీస్​ చేసి విషయాన్ని అవగాహన చేసుకుని సబ్జెక్ట్​పై పట్టు సాధించాలి. డీఎస్సీలో టెట్​కు 20 శాతం వెయిటేజీ ఉన్నందుకు ప్రతి అభ్యర్థి 120 పైగా మార్కులు సాధించాల్సిందే.. మ్యాథ్స్​ లో 24/24 మార్కులు స్కోర్​ చేసేందుకు అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయకుండా మ్యాథ్స్​ పై పట్టు సాధించండి… ఆల్​ ది బెస్ట్​…

Leave a Comment