తెలంగాణాలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. కాగా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కుటుంబాలు అర్హత ఉన్న రేషన్ కార్డులను పొందలేదు.
ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైనా… ఇంకా ప్రకటనలకే పరిమితమవుతందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
కాగా తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ.. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా 36 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. వీటితో పాటు సంక్రాంతి నుంచి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం కూడా అందజేస్తామని ప్రకటించారు.
ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తే.. ఎంతో మంది పేద ప్రజలకు మేలు జరగనుంది.
TG NEW Ration CARDS: కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్