TG New Rationcards list
తెలంగాణ సెంట్రల్ డెస్క్: తెలంగాణాలో కొత్త రేషన్‌కార్డులపై గందరగోళ పరిస్థితి నెలకొంది. జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ అభయహస్తం పథకాలతో పాటు కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గ్రామాల్లో గురువారం నుంచి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే లిస్టులో పేర్లు వచ్చిన వారి కుటుంబాలను మాత్రమే సర్వే నిర్వహిస్తున్నారు.
కొత్తరేషన్‌కార్డులకు అర్హులను పేర్కొంటూ గ్రామపంచాయతీల్లో లిస్టులను ప్రదర్శించారు. అయితే ఈ లిస్టుల్లో చాలా మంది అర్హుల పేర్లు లేవంటూ లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల వారీగా అధికారులకు అందించిన లిస్టులో తమ పేర్లు లేవంటూ లబ్దిదారులు అధికారులను సంప్రదిస్తున్నారు.

దాదాపు 20లక్షలకు పైగా లబ్దిదారులు రేషన్‌కార్డులకోసం దరఖాస్తు చేసున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలో ప్రజాపాలన ద్వారా కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేశారు. అనంతరం సమగ్ర కుటుంటు కుల సర్వేలోనూ తమకు రేషన్ కార్డు లేదని ప్రజలు దరఖాస్తు పెట్టుకున్నారు.
కానీ దరఖాస్తులు చేసుకున్న వారిలో కనీసం సగానికి పైగా మంది కుటుంబాల పేర్లు తాజాగా ప్రకటించిన లిస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు ఏం చేయాలి? ఏ ప్రాతిపదికన లిస్టును విడుదల చేశారు? మళ్లీ మరో లిస్టు వస్తుందా? ఇప్పటికే రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు చేర్చడం ఏలా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి రేషన్‌కార్డుల పాటు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పై లబ్దిదారుల ఎంపికపై చర్చించనున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందనేది వేచి చూడాలి.
TG New Rationcards: కొత్త రేషన్‌కార్డుల లిస్టుపై గందరగోళం