Tourism and hospital managment courses
టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్
అతిథి దేవోభవ అనే ధర్మాన్ని ఆచరించే భారతదేశంలో పర్యాటకులను గణనీయంగా ఆకర్షించడానికి శిక్షణ పొందిన వ్యక్తులను తయారు చేసేందుకు కొత్త కోర్సులు, ఇన్స్టిట్యూట్లు ఎన్నో పుట్టుకొచ్చాయి. ఈ కోర్సుల్లో పట్టా తీసుకొని మార్కెట్లో అడుగుపెట్టేవారికి పక్కా జాబ్‌లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న సంస్థలు, కెరీర్ అవకాశాల వివరాలు మీకోసం..
పర్యాటకులకు నచ్చిన ప్రదేశాలను చూపించడం టూరిజం అయితే.. వారు మెచ్చేలా వసతి, భోజన సదుపాయం, తదితర సేవలు చేయడమే ఆతిథ్యం. చదువురాని వారు సైతం చేసిన ఈ సేవలు కాస్త ఎక్స్పర్ట్స్ మాత్రమే చేయగలిగే స్థాయికి చేరాయంటే అందుకు కారణం పర్యాటకుల అభిరుచులు, ఆసక్తులు మారడమే. ఒకప్పుడు సందర్శనా స్థలాలకే పరిమితమైన పర్యాటకం ఇప్పుడు శాఖలుగా వ్యాపించి ఎకో టూరిజం, మెడికల్ టూరిజం, కల్చరల్ టూరిజం, ఫిల్మ్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం, రిలీజియస్, స్పేస్, అడ్వెంచర్, బిజినెస్, వెల్నెస్ రంగాలకు విస్తరించడంతో యువతకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
భారత్‌లో పర్యాటకుల సంఖ్య పెరగడానికి ఇక్కడి ఆతిథ్యం ఒక కారణమైతే.. భౌగోళిక జీవవైవిధ్యం, ఆకర్షణీయ బీచ్‌లు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు, శిల్పకళ, బయోడైవర్శిటీ హాట్‌స్పాట్స్, వైవిధ్యభరిత జంతుసంపద కలిగిన జాతీయ పార్కులు, ఆధ్యాత్మికకు ప్రతీకగా నిలిచే దేవాలయాలు మరో కారణం అని చెప్పవచ్చు. 2028 నాటికి 31 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు భారత్‌లో అడుగుపెడతారని అంచనా. 2017లో 42 మిలియన్ల మందికి ఉపాధి కల్పించిన ఈ రంగం 2028 నాటికి 55 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించనుంది. పర్యాటకుల సంఖ్యను ద్విగుణీకృతం చేసేందుకు ఇండియా త్వరలోనే ఈ–వీసా విధానంను తీసుకురానుంది. 2018 నాటికి 14 రాష్ర్టాలు టూరిస్ట్ పోలీసులను నియమించుకున్నాయంటే ఈ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
టూరిజంకు ఎన్ఐటీహెచ్ఎం(tourism NITHM)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో 2001లో ఏర్పాటైన హైదరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (ఎన్ఐటీహెచ్ఎం) టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది. ఎంబీఏకు ఐసెట్, సీమ్యాట్, మ్యాట్ స్కోర్ల ద్వారా ప్రవేశం కల్పిస్తుండగా, బీబీఏకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఏటా జూన్/జూలైలో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ అనంతరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. టూరిజం అండ్ హాస్పిటాలిటీలో కోర్సులు అందిస్తున్న ఏకైక సంస్థ ఇది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) కూడా టూరిజం, ట్రావెల్, కార్గో విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
హోటల్ మేనేజ్మెంట్కు ఐహెచ్ఎం(HOTEL MANAGEMENT IHM)
హోటల్ మేనేజ్‌మెంట్‌ల్లో కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలే ఇన్స్టిట్యూట్ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లు. వీటిని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎంసీటీ) పర్యవేక్షిస్తుంది. ఎన్సీహెచ్ఎంసీటీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీతో కలిసి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ (జేఈఈ) ద్వారా బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా, ఇతర టూరిజం కోర్సుల్లో దాదాపు 50 ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందొచ్చు. దీనికి ఇంటర్ లో అన్ని గ్రూపుల వారు అర్హులు. ది తాజ్‌గ్రూప్ హోటల్స్ ఐహెచ్ఎం-ఏ, సింబయాసిస్ స్కూల్ ఆఫ్ కులినరీ ఆర్ట్స్ నిర్వహించే సెట్ జెన్ పరీక్షల ద్వారా కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. కొన్ని ప్రైవేటు కాలేజీలు నేరుగా అడ్మిషన్ కల్పిస్తాయి.
వీటితో పాటు గ్వాలియర్, భువనేశ్వర్‌లో ఉన్న ఐండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ క్యాట్ / మ్యాట్ / ఎక్స్‌ఏటీ / ఏటీఎంఏ / జీమ్యాట్ స్కోర్ కలిగిన వారికి టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా కోర్సును ఆఫర్ చేస్తోంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ డిస్టెన్స్‌లో ఎంఏ టూరిజం మేనేజ్మెంట్ కోర్సును అందిస్తోంది. ఉన్నత చదువులు చదవాలనుకునేవారికి ఫుడ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజ్మెంట్, డైటీటిక్స్ అండ్ హాస్పిటల్ ఫుడ్ సర్వీసెస్, అకామడేషన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హౌస్‌కీపింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్, ఫుడ్ ప్రొడక్షన్, బేకరీ అండ కన్ఫెక్షనరీ, హాస్పిటల్ అడ్మినిస్ర్టేషన్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ వంటి పీజీ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు(COURSES)
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ)
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ర్టేషన్ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ)
బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్)
బీటెక్ (హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ)
బీఏ (హానర్స్) ఇన్ హోటల్ మేనేజ్మెంట్
బీఏ (హానర్స్) ఇన్ కులినరీ ఆర్ట్స్
ఎంఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైటీటిక్స్ అండ్ హాస్పిటల్ ఫుడ్ సర్వీస్
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అకామడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్
డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్
డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్
డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ
డిప్లొమా ఇన్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్
డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ ఆపరేషన్
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పాటిస్సెరి
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్
ఏమి నేర్పిస్తారు?
ఈ కోర్సుల్లో కొన్ని టాపిక్స్ అందరికీ కామన్ కాగా మరికొన్ని మారుతుంటాయి. పర్యాటకులను ఆహ్వానించడం దగ్గర నుంచి వారికి చేయాల్సిన సేవలు, కల్పించాల్సిన సౌకర్యాలు, టూర్ ప్లాన్స్, టూర్ డెరైక్షన్, రూట్ మ్యాప్స్ తయారీ, గైడింగ్ స్కిల్స్, ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్ అండ్ హౌస్ కీపింగ్ తదితర అంశాలను బోధిస్తారు.
ఉద్యోగావకాశాలు
పర్యాటక, ఆతిథ్య రంగాల్లో గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత అవకాశాలుండటానికి కారణం ఇది హోటల్, ట్రావెల్, టూరిజం వంటి అనేక అనుబంధ రంగాల సమ్మేళనం కావడమే. ప్రైవేటు రంగంలోనే అధిక ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ పర్యాటక శాఖలు, ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్స్, ఎయిర్‌పోర్ట్స్, ఎయిర్‌లైన్స్, జాతీయ, అంతర్జాతీయ హోటల్స్, క్యాటరింగ్ కంపెనీస్, షిప్పింగ్ అండ్ క్రూయిస్, కార్పొరేట్ ఫుడ్ చైన్స్, స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్స్, రిసార్ట్స్, స్పా, ఈవెంట్ ఆర్గనైజర్స్, ఎయిర్‌లైన్ కేటరింగ్, ఎయిర్ లైన్స్, రైల్వేలు, క్రూస్ లైన్స్, గెస్ట్హౌసెస్, టూరిజం సెంటర్స్, ల్యాండ్రీ, టూరిజం ప్రమోషన్ అండ్ సేల్స్, తాజ్ గ్రూప్, ఐటీసీ, ఒబెరాయ్, హయాత్, జీఎంఆర్, రాడిసన్, గ్రీన్‌పార్క్, థామస్‌కుక్ వంటి సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. ఎగ్జిక్యూటివ్/అసిస్టెంట్ స్థానంలో ప్రవేశించే వారికి నెలకు 15 వేలకు పైగా వేతనం అందుతుంది. మిడిల్ మేనేజర్, టాప్ పొజిషన్‌కు చేరుకుంటే లక్షల్లో జీతాలుంటాయి.
ఎగ్జిక్యూటివ్/సూపర్వైజర్, ఎగ్జిక్యూటివ్ ఇన్చార్జ్, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్/గ్రౌండ్ స్టాఫ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్ సూపర్వైజర్, యాడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టూర్ ప్లానర్, రిజర్వేషన్, కౌంటర్ స్టాఫ్, టూర్ గైడ్స్, అసిస్టెంట్స్ వంటివి ఈ రంగంలో ఉండే జాబ్ ప్రొఫైల్స్. ఎంట్రప్రెన్యూర్లుగా మారి టూరిజం, హాస్పిటాలిటీలో స్టార్టప్స్ ప్రారంభించవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన కేంద్ర రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడొచ్చు.
ఉండాల్సిన నైపుణ్యాలు
సహనం, చెరగని చిరునవ్వు
సూటిగా, స్పష్టంగా మాట్లాడటం
ఎదుటివారిని మెప్పించే తత్వం
చక్కని విషయ పరిజ్ఞానం
ప్రయాణాలంటే ఇష్టపడటం
టూరిజం చట్టాలపై అవగాహన
టాప్ ఇన్స్టిట్యూట్స్
డాక్టర్ వైఎస్సార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ www.nithm.ac.in
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ http://www.nchm.nic.in
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ www.iittm.ac.in
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ www.ihmhyd.org
కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ www.iactchefacademy.com ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ, న్యూఢిల్లీ www.ignou.ac.in
Tourism and hospital managment course: పట్టా ఉంటే..పక్కా జాబ్..టూరిజం& హాస్పిటల్ మేనేజ్మెంట్
1 thought on “Tourism&hospital managment course:టూరిజం& హాస్పిటల్ మేనేజ్మెంట్”