భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ (DoS) సంయుక్తంగా విద్యార్థుల కోసం ‘ఇంటర్న్‌షిప్ & స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ’ పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. అంతరిక్ష సాంకేతిక రంగంలో విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ (UG), పీజీ (PG), పీహెచ్‌డీ (PhD) చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. భారతదేశం లేదా విదేశాల్లోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ప్రస్తుతం చదువుతున్నవారు లేదా గత 6 నెలల్లో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు విద్యార్హతల్లో కనీసం 60% మార్కులు లేదా 6.32/10 CGPA కలిగి ఉండాలి. దరఖాస్తులు జులై 1 నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 30.
ఇంటర్న్‌షిప్ స్కీమ్: ఈ ప్రోగ్రామ్ గరిష్ట వ్యవధి 45 రోజులు. ఇస్రో కేంద్రాల్లో పనిచేస్తూ అంతరిక్ష సాంకేతికతపై నేరుగా అవగాహన పెంచుకోవచ్చు.
స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్: B.E/B.Tech (6వ సెమిస్టర్ పూర్తయినవారు – కనీసం 45 రోజులు), M.E/M.Tech (1వ సెమిస్టర్ పూర్తయినవారు – 120 రోజులు), B.Sc/డిప్లొమా (చివరి సంవత్సరం – 45 రోజులు), M.Sc (1వ సెమిస్టర్ – 120 రోజులు), పీహెచ్‌డీ (కోర్స్‌వర్క్ పూర్తయినవారు – 30 నెలలు) విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలు, నిపుణుల మార్గదర్శకత్వంలో వాస్తవ ప్రాజెక్టులపై పనిచేయవచ్చు.
ఈ శిక్షణకు ఎటువంటి స్టైపెండ్ లేదా ఆర్థిక సహాయం ఉండదు, అలాగే వసతి సదుపాయం సాధారణంగా అందించబడదు. ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా సంబంధిత కేంద్రాల గైడ్‌లైన్స్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇస్రోలో ఇంటర్న్‌షిప్, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ అవకాశాలు







