ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 15న ప్రాథమిక (పార్ట్) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రకటనలో భర్తీ చేయనున్న పోస్టులు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు మరియు పరీక్షల షెడ్యూల్ అందుబాటులో ఉంటాయి. సిలబస్, రిజర్వేషన్ రోస్టర్ వంటి పూర్తి వివరాలతో కూడిన సమగ్ర ప్రకటనను అక్టోబరు మొదటి వారంలో వెలువరించనున్నారు.
ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితిని జూలై 1 నాటికి ఉన్న వయసు ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల గ్రూప్-1 సర్వీసెస్ నియామకాల జాబితాను సవరించింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీజోన్ పోస్టులుగా మార్చడంతో పాటు కొత్తగా వయోజన విద్య సహాయ సంచాలకులు (4), జిల్లా విద్యాధికారి-డీఈఓ (14) పోస్టులను చేర్చడంతో మొత్తం గ్రూప్-1 ఖాళీల సంఖ్య 167కు చేరింది.
ఇందులో డిప్యూటీ కలెక్టర్ (11), డిఎస్పీ (36), డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (35), సహాయ కమిషనర్ (14), డిప్యూటీ రిజిస్ట్రార్ (10) వంటి ప్రాముఖ్యత ఉన్న పోస్టులు ఉన్నాయి. అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను సైతం ఏపీపీఎస్సీ ద్వారానీ భర్తీ చేయనున్నారు.
పరీక్షల నిర్వహణ విషయానికి వస్తే.. గ్రూప్-1, గ్రూప్-2 నియామక పరీక్షలను మ్యాన్యువల్ (రాత) విధానంలోనే నిర్వహిస్తారు. అయితే ఇతర నియామకాలకు పేపర్ లీకేజీలు అరికట్టేందుకు ఆన్లైన్ పరీక్షలు జరిపే అంశాన్ని ఏపీపీఎస్సీ పరిశీలిస్తోంది. కొత్తగా విద్య పూర్తి చేసిన అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకోవచ్చని సూచించారు.
ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 15న ప్రాథమిక నోటిఫికేషన్







