అంగన్వాడీలో 15 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 35, 781 అంగన్వాడి కేంద్రాల్లో 71,562 మంది పనిచేస్తున్నారు.
ఈ ఏడాదిలోపు దాదాపు 15 వేల పై చీలుకు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే ఆయా అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయాల పోస్టుల వివరాలను సేకరించింది. దీంతోపాటు ఉద్యోగ విరమణ చేసిన చోట ఏర్పడిన ఖాళీలను సైతం గుర్తించింది. అన్నీ కలిపి 15,982 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇందులో 12 వేల పైగా పోస్టులు ఆయాలు, 3000కు పైగా పోస్టులు టీచర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలోపే కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. అయితే పోస్టుల భర్తీకి కావలసిన విద్య అర్హత, నియామక విధానంపై శిశు సంక్షేమ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు గొప్ప అవకాశం లభించనుంది.







