తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కసరత్తు వేగవంతం చేసింది. రాబోయే రెండు నెలల్లో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో అటవీ శాఖలోని దాదాపు 1,500 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 3,000కు పైగా పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వ వర్గాల నుండి ప్రతిపాదనలు అందుతున్నాయి.
నియామకాల్లో ఆధునిక సాంకేతికత:
నియామకాల్లో నిష్పాక్షికత, భద్రత, మరియు పారదర్శకతను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్లాక్‌చైన్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. పరీక్షల నిర్వహణను వేగవంతం చేసేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది.
ఈ నూతన విధానం ద్వారా పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థి సాధించిన మార్కులు స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే దశలో జరిగే పరీక్షల ప్రక్రియను 3 నుండి 6 నెలల్లో, మల్టీస్టేజ్ పరీక్షలను గరిష్టంగా 9 నెలల్లో పూర్తి చేయాలని టీజీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాంకేతిక మార్పుల ద్వారా అక్రమాలకు తావులేకుండా నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు
వచ్చే నెల నుండి టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు







